జర్మనీలో విద్య ఉచితం — ఇది కొంత వరకు వాస్తవం. జర్మనీలో ఆహారం ఉచితం — ఇది అవాస్తవం. ఇక మొదటి పాయింట్ మీద కొంచెం సేపు మనం మాట్లాడుకుందాం: జర్మనీలో ప్రభుత్వ స్కూల్స్ , కాలేజీలలో చదివే విద్యార్థులకు ఫీజులు ఎక్కువ ఉండవు. స్కూల్స్ లో ఉచిత విద్య ఉన్నా , కాలేజీ లెవల్లో కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటి గమనించాలి. ప్రభుత్వ యూనివర్సిటీలలో మాత్రమే విద్య ఉచితం, కానీ ప్రైవేట్ యూనివర్సిటీలలో ఎక్కువ మొత్తం ఫీజులు కట్టాల్సిందే. జర్మనీ ప్రజల తత్వం ప్రకారం, విద్య అనేది ఒక non-commercial entity! జర్మనీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇతర దేశాల నుండి వచ్చే విద్యార్థులకు సైతం ప్రభుత్వ యూనివర్సిటీలలో కొంత వరకు ఉచిత విద్య (ఇతర దేశాలలో ఇది తక్కువ) ఉండడం.
అందరు ఇక్కడికి వచ్చి చదువుకోవొచ్చు కదా అని? అవును జర్మనీ కూడా వేరే దేశాల నుండి వచ్చే విద్యార్థులను స్వాగతిస్తుంది. కానీ మన దేశం నుండి ఇక్కడ ఒక ప్రభుత్వ యూనివర్సిటీలో సీట్ రావడం కొంత సవాలుతో కూడుకున్నది. మంచి విద్యార్హతలు, కొంత జర్మన్ భాషలో ప్రావిణ్యం ఉంటె ఒక ప్రభుత్వ యూనివర్సిటీ కి మీ అప్లికేషన్ పంపవచ్చు. ఉదాహరణకు ఇంజనీరింగ్ లో Technical Universities (TU) మంచి నాణ్యమైన విద్యను అందిస్తాయి. వీటిలో సీట్ రావడం అంత సులభం కాదు. వస్తే మాత్రం ఫీజు చాలా నామమాత్రం. ఒక వేళ సీట్ వచ్చినా ఇక్కడ మీరు రెంట్ కట్టడానికి, భోజనానికి తగిన డబ్బు మీదగ్గర ఉందని మన దేశంలో ఉండే జర్మన్ వీసా ఆఫీస్ వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది.
చాలా మంది విద్యార్థులు ప్రభుత్వ యూనివర్సిటీస్ లో సీట్లు రాక ఎక్కువ డబ్బు కట్టి ప్రైవేట్ యూనివర్సిటీలలో చదువుతున్నారు. మన భారత దేశంతో ఒకసారి జర్మనీ ని పోల్చాలని ఉంది: మన గవర్నమెంట్ స్కూళ్లలో కూడా విద్య ఉచితమే కదా! కాకపోతే మనతో పోల్చుకుంటే నాణ్యతలో, సౌకర్యాలలో జర్మనీ విద్యావిధానం చాలా ముందుంది. ఇక మన ప్రభుత్వ కళాశాలలో ఇంజనీరింగ్ , మెడికల్, లేదా ఇతర సైన్స్, ఫిలాసఫీ , లాంగ్వేజ్ మొదలగు కోర్సులు కూడా కొంత వరకు ఫీజు విషయంలో పర్వాలేదు కదా? సీట్ రావడం కొంత కష్టం అంతే! – అలాగే జర్మనీ లో కూడా! మన దేశం నుండి వచ్చే కొన్ని అప్లికేషన్లతో తలనొప్పి: ఒక రోజు మా ప్రొఫెసర్ నాకు మన దేశం నుండి వచ్చిన కొన్ని అప్లికేషన్లు చూడమని పంపారు. కొంత బాధాకరమైన విషయం ఏంటంటే ,
అప్లికేషన్ లో ఇక్కడకు వచ్చి ఎందుకు చదవాలని రాయవలసి ఉంటుంది. దీన్నే మోటివేషన్ లెటర్ అంటారు. మన పిల్లలు చాలామంది consultancies కి వెళ్లి అక్కడ ఉన్న వారితో ఇలాంటి లెటర్లు రాయించి పంపుతారు. సూమారు అన్ని లెటర్లు ఒకలాగా ఉండి, అందులో అర్ధభాగం జర్మనీ భజన తో నిండి ఉంటుంది (ఇక్కడ భజనలు పనికిరావు)! అలాంటి దరఖాస్తులు పబ్లిక్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు తీసి పక్కన వేస్తారు! మీ అంతట మీరు అలోచించి అప్లికేషన్ పంపితే ప్రొఫెస్సొర్స్ కు కొంత చదవడానికి ఆసక్తి ఉంటుంది.