పాకిస్థాన్ క్రికెట్ మాజీ ప్లేయర్ ఇంజమామ్ ఉల్ హక్ మరోమారు వివాదాస్పద కామెంట్లు చేశాడు. ఇటీవలే భారత్ చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న నేపథ్యంలో ఇంజమామ్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఐపీఎల్‌లో ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లు కూడా ఎప్పటి నుంచో ఆడుతున్నారన్న విషయం విదితమే. అయితే ఇండియన్ ప్లేయర్లు మాత్రం ఇతర దేశాల లీగ్‌లలో ఆడకుండా బీసీసీఐ నిషేధం విధించింది. కేవలం రిటైర్ అయ్యాకే ఇతర దేశాల లీగ్‌లలో ఆడాలని కండిషన్ పెట్టింది. అయితే దీనిపైనే ఇంజమామ్ కామెంట్లు చేశాడు.
బీసీసీఐ తమ ప్లేయర్లను ఇతర దేశాల లీగ్‌లు ఆడేందుకు అనుమతించడం లేదని, అలాంటప్పుడు ఇతర దేశాల క్రికెట్ బోర్డులు ఈ విషయంపై ఆలోచించాలని ఇంజమామ్ అన్నాడు. బీసీసీఐ తమ ప్లేయర్లను ఇతర లీగ్‌లకు పంపకుంటే ఇతర బోర్డులు కూడా తమ ప్లేయర్లను ఐపీఎల్‌కు పంపకూడదని అన్నాడు. ఐపీఎల్‌ను బ్యాన్ చేయాలని అన్నాడు. చాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలిచిందని తాను ఈ వ్యాఖ్యలు చేయడం లేదని, ఒక దేశానికి చెందిన క్రికెట్ సభ్యుడిగా ఆడాను కాబట్టి ఈ కామెంట్లు చేస్తున్నానని అన్నాడు. అయితే దీనిపై బీసీసీఐ స్పందించాల్సి ఉంది.
ఇక ఈ నెల 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం అవుతున్న విషయం విదితమే. అందులో భాగంగానే ఫ్రాంచైజీలు ప్రస్తుతం ప్లేయర్లతో ట్రెయినింగ్ క్యాంపులను నిర్వహిస్తున్నాయి. ఇక పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ఐపీఎల్‌తో క్లాష్ అవ్వనుంది. ఈ లీగ్‌ను ఏప్రిల్ 11 నుంచి మే 18 వరకు నిర్వహించనున్నారు. ఐపీఎల్ ఉంది కనుక పీఎస్ఎల్‌కు ఆదరణ ఉండదని భావించిన ఇంజమామ్ ఈ కామెంట్లు చేసి ఉంటాడని భావిస్తున్నారు.