Tongue Cleaners : ఉదయం లేవగానే బ్రష్ చేసుకుని దంతాలను క్లీన్ చేసుకుని నోరు పుక్కిలిస్తాం. రెండు పనులకు మధ్యలో మధ్యలో నాలుకను క్లీన్ చేసుకుంటాం. దానికొరకు కొందరు తమ వేలిని, బ్రష్ నే ఉపయోగిస్తే మరికొందరు టంగ్ క్లీనర్ ను ఉపయోగిస్తారు. బ్రష్ చేశాక నాలుకను శుభ్రం చేసుకోవడం మంచిదంటున్నారు డాక్టర్లు. దీనివలన నాలుక చుట్టుపక్కల ఉండే క్రిములు కడుపులోకి పోకుండా జాగ్రత్త పడినవాళ్లమవుతాం. నాలుక క్లీనింగ్ కి టంగ్ క్లీనర్ వాడడం మనకు ఆరోగ్యకరమా కాదా.. ఒక వేళ వాడేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా టంగ్ క్లీనింగ్ కు ప్లాస్టిక్ లేదా స్టీల్ తో చేసిన టంగ్ క్లీనర్స్ ను వాడుతూ ఉంటాం. అయితే అలా కాకుండా రాగితో తయారుచేసిన తేలికపాటి టంగ్ క్లీనర్స్ ను మనం ఉపయోగిస్తే మన దంత సంరక్షణకే కాదు, శరీర ఆరోగ్యానికి మేలు జరుగుతుందని కొన్ని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. మనుష్యులు ఆరోగ్యంగా బ్రతకడానికి కావాల్సిన ఎంజైములను అందించడంలో రాగి కీలక పాత్ర పోషిస్తుంది. క్రిమినాశక గుణాలు రాగి లోహంలో చాలా అత్యధికంగా ఉన్నాయని కొన్ని అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. అందువల్లనే ఇప్పుడు కొన్ని పాశ్చాత్య దేశాలలో అక్కడి దంత వైద్యులు కాపర్ టంగ్ క్లీనర్స్ వాడమని సలహాలు ఇస్తున్నారట.
మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పాశ్చాత్య దేశాలలోని కొన్ని హాస్పిటల్స్ లోని గదులలో వివిధ రాగి పాత్రలను ఉపయోగించి ఇప్పుడు అలంకరిస్తున్నారు .దీనికి కారణం ఆయా గదులలో ఉండే చెడు సూక్ష్మ జీవుల శాతం గణనీయంగా తగ్గించడంలో రాగి ప్రధానపాత్ర వహిస్తుందని అక్కడి వైద్యులు ఇప్పటికే గుర్తించారు. రాగి మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనం కొత్తగా తెలుసుకోవాలా. అక్కర్లేదు కదా. మరెందుకు ఆలస్యం.. టంగ్ క్లీనర్లకు కూడా రాగిని వాడేయండి.