షుగర్ వ్యాధి లేదా చక్కెర వ్యాధి చాలా ప్రాచీనమైంది. మానవ జాతిని వందల సంవత్సరాలనుండిపట్టి పీడిస్తోంది. ఈ వ్యాధిని గురించి ప్రాచీన శాస్త్రాలలో కూడా వివరించారు. ఇది ఒక దీర్ఘకాల జీవన ప్రక్రియ అసమతుల్యతగా చెప్పబడుతుంది. రక్తంలో షుగర్ స్ధాయి పెరిగిపోతుంది. దీనినే ఇంగ్లీషులో డయాబెటీస్ అంటాము. అంటే తీపి అని అర్ధం. చక్కెర వ్యాధి లేదా షుగర్ వ్యాధి లేదా డయాబెటీస్ లేదా డయాబెటీస్ మెల్లిటస్ అనే పేర్లన్ని దైనందిన జీవితంలో ఒకే రకంగా వాడేస్తూంటాము.
మనం తినే తిండిలో వున్న గ్లూకోజు పొట్టలోకి వెళ్ళి రక్తంలోకి ప్రవేశిస్తుంది. ఇక మనకు ఎనర్జీ ఇవ్వాలంటే ఈ గ్లూకోజు కణాలలోకి చేరాలి. గ్లూకోజు కణాలలోకి చేరేందుకుగాను ఇన్సులిన్ సహాయపడుతుంది. ఇన్సులిన్ అనే పదార్ధాన్ని మన దేహంలోని పాన్ క్రియాస్ గ్రంధి ఉత్పత్తి చేస్తుంది. ఈ పాన్ క్రియాస్ గ్రంధి కనుక సరిగా పని చేయకపోతే ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది. అపుడు మనం తిన్న గ్లూకోజు కణాలలోకి పూర్తిగా చేరకుండా రక్తంలోనే నిలువ వుంటుంది. ఈ స్ధితినే షుగర్ వ్యాధి వచ్చిన దశగా చెపుతారు.
డయాబెటీస్ వ్యాధి నాకే ఎందుకు రావాలి? మా కుటుంబంలో ఎవరికీ లేదే. నాకెలా వచ్చింది. అనేది తరచుగా వింటూంటాం. కుటంబ చరిత్ర తప్పకుండా పరిగణలోకి తీసుకోవాల్సిందే. డయాబెటీస్ రావటం మీ తప్పు కాదు. భారత దేశంలోని గ్రామీణులలో 6 శాతం , నగరవాసులలో 14 శాతం ఈ వ్యాధికి గురై వున్నట్లు తెలుస్తోంది. తాజా పరిశోధనలలో ప్రపంచం మొత్తంలోకి ఆసియా ఖండ నివాసులలో ఈ వ్యాధి అధికంగా వున్నట్లు తెలుస్తోంది. పాశ్చాత్య దేశాల వారికంటే కూడా మనకు మరింత చిన్న వయసు (సుమారు 10 సం.) లోనే వచ్చేస్తున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.