గత 5 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఫుల్ బాడీ చెకప్ చేయించుకోవడం నాకు అలవాటు. 4 సంవత్సరాలకు ముందు చేసిన పుల్ బాడీ చెక్ అప్ లో గ్రేడ్ -1 ఫాటీ లివర్ అని రిపోర్ట్ వచ్చింది. అంతకుముందు 24 గంటలు ఆఫీస్ వర్క్ గురించి ఆలోచిస్తూ నా హెల్త్ ను పెద్దగా పట్టించుకోక పోవడం వల్లో లేక పిజ్జాలు ఎక్కువగా తినడం వల్లో లేదా పై రెండు కారణాల వల్ల ఎత్తుకు మించి బరువు ఉండడం వల్లో , లేక రక్తం లో కొలెస్ట్రాల్ కొంచెం అధికంగా ఉండడం వల్ల ఆలా జరిగి ఉండొచ్చు.నాకు మద్యపానం , సిగిరెట్ లాంటి దుర్వ్యసనాలు లేవు. కొంచెం స్వీట్స్ ఎక్కువ తినేవాడ్ని. మా ఆఫీసులో చాలా మందికి కూడా ఇదే ప్రాబ్లెమ్ ఉన్నట్టు విన్నా.
ఆ తరువాత ఫాటీ లివర్ కి దారితీసే కారణాలు కూడా శోధించాను. ఆ కారణాలు.. అనువంశికం, కామెర్లు, కొన్ని రకాల మందుల వల్ల, మద్యపానం, ధూమపానం, అధిక కొలెస్ట్రాల్, అధిక బరువు, మధుమేహం, అధిక BP, వేగంగా బరువు తగ్గడం, హైపోథైరాయిడిజం. వైద్య పరిభాషలో ఫాటీ లివర్ ను రెండు ప్రాథమిక రకాలుగా విభజించారు. ఆల్కహాలిక్ ఫాటీ లివర్. నాన్ అల్కోహాలిక్ ఫాటీ లివర్. ఆల్కహాలిక్ ఫాటీ లివర్ మద్యపానం ఎక్కువ గా చేసేవారిలో వస్తుంది. నాన్ అల్కోహాలిక్ ఫాటీ లివర్ మద్యపానం కాకుండా మరే ఇతర కారణాల వల్ల రావొచ్చు దీన్ని కనుక్కోవడం చాలా కష్టం. అదృష్టం కొద్దీ నేను ప్రతి సంవత్సరం రొటీన్‌గా చేయించే టెస్ట్ వల్ల అది బయట పడింది.
ఫాటీ లివర్ జబ్బులో మూడు గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ -1, గ్రేడ్ -2, గ్రేడ్ -3. గ్రేడ్ -1 పైన చెప్పిన ఏదో ఒక కారణం వల్ల చాలామందిలో ఉండే ఇప్పడిప్పుడే అంతగా హాని కలిగించని స్టేజ్. ఈ స్టేజ్ లో లివర్‌లో కొంచెం కొవ్వు పెరుగుతుంది. లివర్ (పసుపు రంగులో) కొవ్వు కణాలు పెరుగుతాయి. లివర్‌లో ఎంత ఎక్కువగా కొవ్వు కణాలు పెరిగితే అంతగా దాని పని తీరు మందగిస్తుంది. తరువాత చేసిన పరిశోధనలో గ్రేడ్ -1ఫాటీ లివర్ ని పూర్తిగా నయం చేయొచ్చు అని తెలుసుకొన్నాను. నేను తినే తిండి, జీవన శైలి లో మార్పుల వల్ల ఇప్పుడు నా గ్రేడ్ -1 ఫాటీ లివర్ ప్రాబ్లెమ్ పూర్తిగా నయం అయ్యింది. దీని కోసమే నేను అన్నం మాని మిల్లెట్స్ తినడం, రోజు 5 నుంచి 7 కిలోమీటర్లు నడవడం, స్వీట్స్, పిజ్జాలు తినడం పూర్తిగా తగ్గించా. గ్రేడ్ -2 ఫాటీ లివర్ కూడా పూర్తిగా నయం చెయ్యొచ్చు అని చదివాను.
గ్రేడ్ -3 లోకి చేరితే మాత్రం పూర్తిగా నయం చెయ్యలేం, అది లివర్ సిర్రోసిస్ కి దారితీస్తుంది, కాలేయ మార్పిడి ఒక్కటే మార్గం, 15–30 లక్షలు ఖర్చు అవుతుంది ఈ ఆపరేషన్ కు, అందుకే తొందరగా మేలుకోండి జీవన శైలి లో మార్పులు చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి. లివర్ ఫంక్షన్ టెస్ట్, ఆల్ట్రాసౌండ్ స్కాన్ లో లివర్ పరిస్థితి తెలుస్తుంది. ఆఖరుగా మీ బాగా నమ్మే ఒక మంచి వైద్యుడిని సంప్రదించండి.