Injection : ఏదైనా అనారోగ్య సమస్య వస్తే మనం డాక్టర్ వద్దకు వెళ్తాం. మనకు వచ్చిన అనారోగ్య సమస్యను బట్టి డాక్టర్ మనకు ట్యాబ్లెట్లను ఇస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో అవసరం అయితే ఇంజెక్షన్లు చేస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు ఇంజెక్షన్లు అంటే భయపడతారు. సూది వేయించుకోవాలంటే ఎక్కడ లేని ఆందోళనకు గురవుతారు. చిన్నతనం నుంచి ఈ భయం కొందరిని వెంటాడుతుంటుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది ? దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి ? అంటే..
ఇంజెక్షన్లు చేయించుకోవాలంటే ఉన్న భయాన్ని వైద్య పరిభాషలో ట్రైపానోఫోబియా (Trypanophobia) అంటారు. చిన్నతనంలో సహజంగానే సూదులు, కత్తుల వంటి పదునైన వస్తువులు అంటే భయం ఉంటుంది. వాటితో నొప్పి కలుగుతుంది కనుక సహజంగానే ఎవరైనా సరే భయపడతారు. అందుకనే చిన్నతనంలో ఇంజెక్షన్ చేయించుకోవాలంటే ఏడుస్తుంటారు. అయితే పెద్దగయ్యాక చాలా మందికి ఆ భయం పోతుంది. కానీ కొందరికి మాత్రం ఆ భయం అలాగే ఉంటుంది. దీంతో వారు పెద్ద వయస్సులోనూ ఇంజెక్షన్ చేయించునేందుకు జంకుతుంటారు.
ట్రైపానోఫోబియా వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. చిన్నతనం నుంచి ఉన్న భయం అలాగే కొనసాగితే పెద్దయ్యాక కూడా ఆ భయం అలాగే ఉంటుంది. పదునైన వస్తువులు అంటే భయం పోవాలి. లేదంటే పెద్దయ్యాక అలాగే భయపడతారు.
ఇక ఇంజెక్షన్ చేయించుకున్న వారు ఏవైనా తీవ్ర అనారోగ్య సమస్యలకు గురైతే అలాంటి వారిని చూసిన పెద్దలు కూడా ఇంజెక్షన్ చేయించుకునేందుకు భయపడతారు. ఇలా ఆ భయం క్రమంగా వృద్ధి చెందుతుంది.
చిన్న విషయాలకే భయం, ఆందోళనకు గురయ్యే వారు, బీపీ ఎక్కువగా ఉండే వారు ఇంజెక్షన్ అంటే ఎక్కువగా భయపడతారు.
మెదడులో ఇంజెక్షన్ అంటే భయం నాటుకుపోతే ఆ భయాన్ని ఎవరూ తప్పించలేరు. అందువల్ల కొందరికి ఆ భయం శాశ్వతంగా ఉంటుంది. ఇక కొందరు సున్నిత చర్మం కలవారు ఉంటారు. అలాంటి వారు తమ చర్మానికి ఏదైనా అవుతుందేమోనని భయపడతారు. కొందరు ఇంజెక్షన్ వల్ల తమకు హాని కలుగుతుందేమోనని ముందు నుంచి భయపడుతుంటారు. అలాంటి వారికి ఇంజెక్షన్ అంటే ఎప్పటికీ భయమే ఉంటుంది. ఇక కొందరు ఇంజెక్షన్ చేస్తే దాన్ని ఇచ్చిన చోట గాయమై అది పెద్దదవుతుందేమోనని భయపడతారు. అందుకనే ఇంజెక్షన్ చేయించుకునేందుకు భయపడుతుంటారు.
అయితే ఈ భయాన్ని సులభంగానే పోగొట్టుకోవచ్చు. అందుకు గాను మానసిక ఆరోగ్య నిపుణులు థెరపీ ఇస్తారు. పలు సెషన్ల ద్వారా భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తారు. అసలు పేషెంట్‌కు ఇంజెక్షన్ అంటే ఎందుకు భయం కలుగుతోంది ? అన్న మూల కారణాన్ని తెలుసుకుని అందుకు అనుగుణంగా థెరపీ ఇస్తారు. దీంతో ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.