Air Purifier Plants : మనం మన ఇంటి పెరటితో పాటు ఇంట్లో కూడా అనేకరకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటాము. ఇంటి లోపల ఇండోర్ ప్లాంట్ లను కూడా మనలో చాలా మంది పెంచుకుంటున్నారు. ఇంటి లోపల పెంచుకునే ఈ ఇండోర్ మొక్కలు అందంగా ఉండడంతో పాటు మన ఇంట్లో ఉండే గాలిని కూడా శుభ్రపరిచి స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన గాలిని మనకు అందిస్తాయి. ముఖ్యంగా దీపావళి సమయంలో ఈ మొక్కలను మనం ఇంట్లో తప్పకుండా పెంచుకోవాలి. దీపావళి సమయంలో బయట గాలితో పాటు ఇంట్లో గాలి కూడా కలుషితమవుతుంది. అలాంటి సమయంలో ఇంట్లో ఈ మొక్కలను పెంచుకోవడం వల్ల ఆక్సిజన్ సరఫరా పెరగడంతో పాటు గాలి కాలుష్యం కూడా తగ్గుతుంది. ఈ మొక్కలు ఇంటికి కూడా ప్రత్యేక ఆకర్షణను తీసుకువస్తాయి. మనం ఇంట్లో పెంచుకోదగిన అందమైన ఇండోర్ మొక్కలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే మొక్కలల్లో కలబంద మొక్క కూడా ఒకటి. ఇంట్లో ఎండ తగిలే చోట ఈ మొక్కను ఉంచాలి. కలబంద గాలిని సమర్థవంతంగా శుభ్రం చేయడంలో మనకు సహాయపడుతుంది. ఇది గాలి నుండి బెంజిన్, ఫార్మాల్డిహైడ్ ను తొలగించడంలో మనకు దోహదపడుతుంది. అలాగే ఈ కలబంద మొక్కను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా పెంచుకోవచ్చు. అలాగే బహుళార్దక సాధక మొక్కలల్లో స్నేక్ ప్లాంట్ కూడా ఒకటి. ఈ మొక్క 107 కాలుష్య కారకాలను గాలి నుండి తొలగించగలదు. అలాగే ఈ మొక్క ఆక్సిజన్ ను కూడా ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. కనుక ఈ మొక్కను బెడ్ రూమ్ లో పెంచుకోకూడదు. ఈ మొక్కను కూడా మనం చాలా సులభంగా ఇంట్లో పెంచుకోవచ్చు.
ఇక రబ్బర్ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల కూడా మనకు మేలు కలుగుతుంది. ఈ మొక్కను పెంచడానికి నీరు ఎక్కువగా అవసరమవుతుంది. అలాగే ద్రవరూపంలో ఉండే ఎరువులను ఎక్కువగా అందిచాల్సి ఉంటుంది. హానికరమైన కాలుష్య కారకాలను గ్రహించడంలో, విష సమ్మేళనాలను విచ్చిన్నం చేయడంలో, ఆక్సిజన్ ను ఎక్కువగా ఉత్పత్తి చేయడంలో ఈ మొక్క మనకు సహాయపడుతుంది. ఇక ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే మొక్కలల్లో పీస్ లిల్లీ కూడా ఒకటి. ఇది ఒక సున్నితమైన మొక్క అని చెప్పవచ్చు. ఈ మొక్క చాలా అందంగా ఉంటుంది. దీని పూలు వివిధ రంగుల్లో ఉంటాయి. గాలిలో ఉండే ఫార్మాల్డిహైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి విష వాయువులను గ్రహించడంలో ఈ మొక్క మనకు ఉపయోగపడుతుంది.
కిచెన్ లో, బాత్ రూమ్ ల దగ్గర ఈ మొక్కను పెంచుకోవాలి. అలగే ఆర్కిడ్ మొక్కలను కూడా మనం ఇంట్లో పెంచుకోవచ్చు. ఎండ ఎక్కువగా తగిలే చోట ఈ మొక్కలను ఉంచాలి. గోడలకు వేసే పెయింట్ లో ఉండే జీలీన్ ను తొలగించడంలో ఇవి మనకు దోహదపడతాయి. ఈ మొక్క పూలు కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ విధంగా ఈ మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇంటికి చక్కటి అందాన్ని తీసుకురావడంతో పాటు గాలిని కూడా శుభ్రపరిచి గాలి కాలుష్యాన్ని తగ్గించడంలో మనకు సహాయపడతాయి.