Veg Pulao : మనకు రెస్టారెంట్ లలో లభించే వాటిల్లో వెజ్ పులావ్ కూడా ఒకటి. వెజ్ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. రైతాతో తిన్నా, మసాలా కూరలతో తిన్నా ఈ పులావ్ చాలా చక్కగా ఉంటుంది. చాలా మంది దీనిని రుచి చూసే ఉంటారు. రెస్టారెంట్ లో లభించే ఈ వెజ్ పులావ్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. లంచ్ బాక్స్ లోకి కూడా ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. స్పెషల్ డేస్ లో, ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఇలా పులావ్ ను తయారు చేసి తీసుకోవచ్చు. ఇంట్లోనే సులభంగా రెస్టారెంట్ స్టైల్ వెజ్ పులావ్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వెజ్ పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 6, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, టమాటా – 1, క్యారెట్ ముక్కలు – అర కప్పు, పచ్చి బఠాణీ – పావు కప్పు, బీన్స్ ముక్కలు – అర కప్పు, తరిగిన బంగాళాదుంప – 1, ఉప్పు – తగినంత, గరం మసాలా – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా, బాస్మతీ బియ్యం – ఒకటిన్నర గ్లాస్, నీళ్లు – రెండు ముప్పావు గ్లాసులు.
మసాలా దినుసులు..
జాపత్రి – 1,అనాస పువ్వు – 1, మరాఠీ మొగ్గలు – 2, నల్ల యాలక్కాయలు – 2, స్టోన్ ప్లవర్ – కొద్దిగా, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 8, యాలకులు – 3, మిరియాలు – 15, బిర్యానీ ఆకులు – 2.
వెజ్ పులావ్ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో నెయ్యి,నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీడిపప్పు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత మసాలా దినుసులు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత కూరగాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి. తరువాత బియ్యాన్ని కడిగి వేసుకోవాలి. ఈ బియ్యాన్ని 2 నుండి 3 నిమిషాల పాటు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత మూత పెట్టి పెద్ద మంటపై నీరంతా పోయే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత పైన జీడిపప్పు, మరికొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి మూత పెట్టాలి. ఇప్పుడు మంటను చిన్నగా చేసి మరో 5 నుండి 6 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ పులావ్ తయారవుతుంది. దీనిని రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా రెస్టారెంట్ స్టైల్ వెజ్ పులావ్ ను ఇంట్లోనే తయారు చేసి తీసుకోవచ్చు.