Banana : సాధారణంగా అరటి పండ్లు అంటే అందరికీ ఎంతగానో ఇష్టం ఉంటుంది. అరటి పండ్లు ఎంతో రుచిగా ఉండడమే కాదు, అనేక రకాల పోషకాలు వాటిల్లో ఉంటాయి. అనేక విటమిన్లు, ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు అరటి పండ్లలో ఉంటాయి. అందువల్లనే చాలా మంది అరటి పండ్లను ఇష్టంగా తింటుంటారు. ఇక ఇవి సీజనల్ పండ్లు కావు, ఏడాది పొడవునా మనకు లభిస్తాయి. అందువల్ల అరటిపండ్లను మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినవచ్చు. అయితే అరటి పండ్లను కొని తేగానే చాలా త్వరగా మగ్గిపోతుంటాయి. అరటి పండ్లను నిల్వ చేయడం సవాల్‌తో కూడుకున్నది. పండ్లు త్వరగా పాడవుతాయి కాబట్టి త్వరగా వాటిని తింటారు. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే అరటి పండ్లను ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉండేలా చేయవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అరటి పండ్లను ఒక్కొక్కటిగా దేనికది వేరు చేసిన తరువాత వాటి మీద ఉండే కాడలకు అల్యూమినియం ఫాయిల్‌ను చుట్టాలి. దీంతో అరటి పండ్లు త్వరగా పండవు. ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటాయి. అయితే అల్యూమినియం ఫాయిల్ లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ కవర్ ను కూడా చుట్టవచ్చు. దీంతో అరటి పండ్లు తాజాగా ఉంటాయి. అలాగే అరటి పండ్లను వేలాడదీయడం వల్ల త్వరగా పండిపోకుండా ఉంటాయి. చాలా మంది షెల్ఫ్ లేదా డైనింగ్ టేబుల్, కిచెన్ టేబుల్ మీద అరటి పండ్లను పెడతారు. అందుకు బదులుగా వీటిని ఏదైనా ప్రదేశంలో వేలాడదీయాలి. దీంతో ఈ పండ్లు చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి. అంత త్వరగా పాడవవు.
వీటికి దూరంగా పెట్టాలి..
ఇక కొన్ని రకాల పండ్లు లేదా కూరగాయలకు అరటి పండ్లను దూరంగా ఉంచాలి. లేదంటే త్వరగా పండుతాయి. యాపిల్స్, టమాటాలు ఎథిలీస్ గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తాయి. అందువల్ల అవి మరింత త్వరగా పండుతాయి. ఆ గ్యాస్ పండ్లు పండే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. కనుక ఆయా కూరగాయలు, పండ్లకు అరటిపండ్లను దూరంగా పెట్టాలి. అలాగే అరటి పండ్లను ఎప్పుడూ ఫ్రిజ్‌లో పెట్టకూడదు. చల్లని వాతావరణంలో పండ్లు త్వరగా పాడైపోయే అవకాశాలు ఉంటాయి. కనుక అరటి పండ్లను ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రత వద్దే ఉంచాలి.
అరటి పండ్లను కొనే సమయంలో ఎలాంటి మచ్చలు లేని పండ్లను కొంటే మంచిది. దీంతో అవి ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటాయి. అయితే కేవలం 1, 2 రోజులు మాత్రమే ఉంటాయి, ఆలోపు తినేస్తాం అనుకుంటే మచ్చలు ఉన్న పండ్లను కొంటేనే మంచిది. ఎందుకంటే వాటిల్లోనే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇక అరటి పండ్లను నేరుగా తినడంతోపాటు వాటితో చాలా మంది స్మూతీలు, మిల్క్‌షేక్‌లు, జ్యూస్‌లు, సలాడ్స్ చేసుకుని తీసుకుంటుంటారు. ఇలా తీసుకున్నా కూడా అరటి పండ్లతో మనకు ప్రయోజనాలే కలుగుతాయి.