Boondi Mixture : మనకు స్వీట్ షాపుల్లో లభించే పదార్థాల్లో బూందీ మిక్చర్ ఒకటి. ఈ మిక్చర్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. స్వీట్ షాప్ లల్లో లభించే విధంగా ఉండే ఈ బూందీ మిక్చర్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. బూందీ మిక్చర్ ను స్వీట్ షాప్ స్లైల్లో ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్వీట్ షాప్ స్టైల్ బూందీ మిక్చర్ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – ఒక కప్పు, బియ్యం పిండి – పావు కప్పు, వంటసోడా – చిటికెడు, నీళ్లు – ఒక కప్పు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, కార్న్ ఫ్లేక్స్ – అర కప్పు, అటుకులు – పావు కప్పు, పల్లీలు – 4 టీ స్పూన్స్, జీడిపప్పు – 4 టీ స్పూన్స్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 5, కరివేపాకు – గుప్పెడు, ఉప్పు – తగినంత, కారం – తగినంత, పుట్నాల పప్పు – 2 టీ స్పూన్స్.
కారపూస తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – ఒక కప్పు, బియ్యం పిండి – పావు కప్పు, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్.
బూందీ మిక్చర్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శనగపిండి, బియ్యం పిండి, వంటసోడా వేసి కలుపుకోవాలి. తరువాత నీళ్లు పోసి కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బూందీ గంటెను తీసుకుని అందులో పిండి వేసి బూందీని వేసుకోవాలి. దీనిని ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా బూందీని అంతా కాల్చుకున్న తరువాత మరనో గిన్నెలో శనగపిండి, బియ్యం పిండి, కారం, ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి. తరువాత నీళ్లు పోసి మెత్తగా పిండిని కలుపుకోవాలి. తరువాత జంతికల గొట్టాన్ని తీసుకుని అందులో పిండిని ఉంచి అందే నూనెలో కార పూస వత్తుకోవాలి. దీనిని ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకుని ముక్కలుగా చేసి బూందీలో వేసుకోవాలి.
తరువాత అదే నూనెలో పల్లీలు, జీడి పప్పు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు ఒక్కొక్కటిగా వేసి వేయించుకుని బూందీలో వేసుకోవాలి. తరువాత ఉప్పు, కారం, పుట్నాల పప్పు వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బూందీ మిక్చర్ తయారవుతుంది. ఈ బూందీ మిక్చర్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఇష్టంగా తింటారు. సాయంత్రం సమయాల్లో, ప్రయాణాలు చేసేటప్పుడు ఇలా ఈ విధంగా బూందీ మిక్చర్ ను తయారు చేసుకుని స్నాక్స్ గా తినవచ్చు.