Chicken Samosa : సమోసాలు అంటే చాలా మందికి ఇష్టమే. సమోసాలను ఇష్టపడని వారు ఉండరు.. అంటే అతిశయోక్తి కాదు. సమోసాలను తినేందుకు చాలా మంది ఆసక్తిని చూపిస్తుంటారు. అసలు వాటి పేరు చెబితేనే కొందరికి నోట్లో నీళ్లూరతాయి. అంత ఇష్టంగా వాటిని లాగించేస్తారు. అయితే సమోసాలు మనం తరచూ ఆలు, కార్న్, ఆనియన్ సమోసాలను తింటుంటాం. కానీ చికెన్ సమోసా కూడా ఉంటుంది. దీన్ని సాధారణంగా బయట విక్రయించరు. కానీ మనం ఇంట్లోనే చికెన్ సమోసాలను ఎంతో సులభంగా చేసుకోవచ్చు. తయారీ చాలా ఈజీ. చికెన్ సమోసాలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ సమోసాల తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ ముద్ద – 200 గ్రాములు, నూనె – 3 టీస్పూన్లు, తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి ముక్కలు – 2 చొప్పున, అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీస్పూన్, పసుపు – పావు టీస్పూన్, కారం – టీస్పూనున్నర, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి – అర టీస్పూన్ చొప్పున, ఉప్పు – తగినంత, కొత్తిమీర తరుగు – సరిపడా, నిమ్మరసం – 2 టీస్పూన్లు.
చికెన్ సమోసాలను తయారు చేసే విధానం..
పాన్‌లో నూనె పోసి వేడయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. అల్లం వెల్లుల్లి ముద్ద జత చేయాలి. ఆ తరువాత చికెన్ వేసి కలపాలి. దీంట్లో కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. చికెన్ ఉడికిన తరువాత చివరగా కొత్తిమీర తరుగు వేసి కలిపేయాలి. ఈ మిశ్రమాన్ని వేరొక గిన్నెలోకి తీసుకుని చల్లార్చాలి. ఇప్పుడు చపాతీ పిండిని తీసుకుని కోడిగుడ్డు ఆకారంలో కాస్త మందంగా పూరీలా చేసుకోవాలి. దీంట్లో చికెన్ మిశ్రమాన్ని కూర్చి సమోసాలా తయారు చేయాలి. ఇలా తయారు చేసి పెట్టుకున్న సమోసాలను వేడి నూనెలో మంటను మధ్యస్థంగా పెట్టి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఇలా అన్ని సమోసాలను వేయించి పక్కన పెట్టాలి. కాస్త గోరు వెచ్చగా అయ్యాక తినాలి. వీటిని టమాటా కెచప్‌తో తినవచ్చు. లేదా నేరుగా తిన్నా కూడా రుచిగానే ఉంటాయి. అందరికీ నచ్చుతాయి. ఎప్పుడూ తినే సమోసాలకు బదులుగా ఒక్కసారి ఇలా చికెన్‌తో సమోసాలను చేసి చూడండి. రుచి చూస్తే అసలు విడిచిపెట్టరు. అందరూ ఇష్టంగా తింటారు.