Chinthapandu Karam : మనం వంటింట్లో కూరలు, పచ్చళ్లతో పాటు రకరకాల కారం పొడులను తయారు చేస్తూ ఉంటాం. అన్నంతో పాటు అల్పాహారాలను తినడానికి కూడా ఈ కారం పొడులను ఉపయోగిస్తూ ఉంటాం. మనం చాలా సులువుగా తయారు చేసుకోగలిగే కారం పొడుల్లో చింతపండు కారం కూడా ఒకటి. ఈ కారం పొడి చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు ఈ కారం పొడిని తేలికగా తయారు చేసుకోవచ్చు. అలాగే దీనిని తయారు చేయడానికి ఎక్కువగా సమయం కూడా పట్టదు. ఎంతో రుచిగా ఉండే చింతపండు కారాన్ని ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చింతపండు కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండుమిర్చి – 50 గ్రా., ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 15, చింతపండు – చిన్న నిమ్మకాయంత, కరివేపాకు – పావు కప్పు, ఉప్పు – తగినంత, నూనె – ఒక టీ స్పూన్.

చింతపండు కారం తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి వేసి వేయించాలి. వీటిని చిన్న మంటపై కలుపుతూ అన్నీ సమానంగా వేగేలా వేయించాలి. తరువాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించాలి. వీటిని కూడా చిన్న మంటపై దోరగా వేయించుకోవాలి. దినుసులు వేగిన తరువాత కరివేపాకు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో వేయించిన ఎండుమిర్చి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత వేయించిన దినుసులు, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
తరువాత చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చింతపండు కారం తయారవుతుంది. దీనిని గాలి తగలకుండా ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవడం వల్ల చాలా రోజుల వరకు తాజాగా ఉంటుంది. ఈ చింతపండు కారాన్ని వేడి వేడి అన్నంతో నెయ్యితో కలిపి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఉదయం పూట చేసే అల్పాహారాలతో కూడా ఈ కారాన్ని కలిపి తినవచ్చు.