Gongura Pickle Recipe : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో గోంగూర ఒకటి. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. గోంగూరను ఆహారంగా తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ గోంగూరతో చాలా మంది పప్పును, పచ్చడిని తయారు చేస్తారు. గోంగూరతో చేసే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఎండుమిరపకాయలను వేసి గోంగూరతో రుచిగా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోంగూర పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
గోంగూర – 5 కట్టలు ( మధ్యస్థంగా ఉన్నవి ), ఎండుమిర్చి – 50 గ్రా., నానబెట్టిన చింతపండు – 10 గ్రా., ఇంగువ – చిటికెడు, ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 10, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, నూనె – 4 టేబుల్ స్పూన్స్, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత.
గోంగూర పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో ధనియాలు, జీలకర్ర, మెంతులను వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తరువాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత అదే కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత వీటిని కూడా ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే కళాయిలో కడిగి ఆరబెట్టుకున్న గోంగూరను వేసి వేయించాలి. గోంగూరలోని నీరు అంతా పోయి గోంగూర బాగా వేగిన తరువాత దీనిని కూడా ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు జార్ లో వేయించిన ఎండుమిర్చిని, ఉప్పును వేసి ముందుగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత వేయించిన ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత వేయించిన గోంగూర, చింతపండు గుజ్జు వేసి మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చిని వేసి వేయించాలి.
తరువాత తాళింపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ, తాళింపు దినుసులు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న గోంగూరను వేసి కలపాలి. దీనిని రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర పచ్చడి తయారవుతుంది. దీనిని గాజు సీసాలో తగి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల పది రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఈ పచ్చడిని వేడి వేడి అన్నం నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ పచ్చిమిర్చి వేసి చేసే గోంగూర పచ్చడి కంటే ఈవిధంగా ఎండుమిర్చిని వేసి చేసే గోంగూర పచ్చడి మరింత రుచిగా ఉంటుంది. దీనిని కూడా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.