Diabetes : షుగర్ వ్యాధితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుంది. ఈ షుగర్ వ్యాధి సర్వసాధారణ అనారోగ్య సమస్యగా మారిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. షుగర్ వ్యాధికి సంబంధించిన మందులను వాడుతూ చక్కటి జీవన విధానాన్ని, ఆహార నియమాలను పాటిస్తూ ఉండే షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. అయితే చాలా మంది షుగర్ వ్యాధి గ్రస్తులు అనేక అనుమానాలను కలిగి ఉంటారు. ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి..ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు అని తెలియక అనేక సందేహాలతో సతమతమవుతూ ఉంటారు.
అయితే షుగర్ వ్యాధి గ్రస్తులు నట్స్, డ్రైఫ్రూట్స్ వంటి వాటిని తీసుకోవచ్చా అలాగే చికెన్, మటన్, చేపలు వంటి మాంసాహారాన్ని తీసుకోవచ్చా.. తీసుకోకూడదు అన్న వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పల్లీలు, అక్రోట్, బాదం, జీడిపప్పు వంటి డ్రై సీడ్స్ లో దాదాపు 80 శాతం నూనె ఉంటుంది. అందువల్ల వీటిని మధుమేహ రోగులు తీసుకోకపోవడమే మంచిది. కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మధుమేహ వ్యాధి గ్రస్తులు వెంటనే బరువు పెరుగుతారు. వెంటనే కాకపోయినా క్రమేపి మధుమేహం కూడా దానికి అనుగుణంగానే పెరుగుతూ ఉంటుంది.
అందుకని షుగర్ వ్యాధి గ్రస్తులు సాధ్యమైనంత వరకు డ్రై సీడ్స్ ను తినకూడదు. అయితే ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష వంటి వాటిని తీసుకోవచ్చు. కానీ వీటిలో నీరు అంతా పోయి చక్కెర మాత్రమే మిగులుతుంది. కనుక షుగర్ ఉన్న వారు ఎండిన వాటి కంటే తాజా పండ్లను తీసుకోవడమే ఉత్తమం. అయితే అప్పుడప్పుడూ ఒకటి లేదా రెండు తింటే ప్రమాదం ఏమి కాదు. ఇక మటన్, చికెన్, చేప ఏదైనా మన దగ్గర వండుకునే పద్దతి ఒకటే. అన్నింటిలోనూ మనం నూనెను ఎక్కువగానే ఉపయోగిస్తాం. కనుక మటన్ మంచిది కాదు చికెన్, చేప మంచిదే అనుకోవడం మన భ్రమే. మధుమేహం ఉన్న వారైనా లేని వారైనా ఒక వయసు వచ్చిన తరువాత మాంసాన్ని తీసుకోకపోవడమే మంచిది.
నిజానికి చికెన్, చేప వంటి వాటిల్లో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉన్నా వండేటప్పుడు నూనె ఎక్కువగా ఉపయోగించడం వల్ల అవి నూనెను పీల్చుకుని హాని కలిగించే కొవ్వు పదార్థాలుగా తయారవుతాయి. కాబట్టి ఏ మాంసాహారం వాడినా నష్టమే. రొయ్యలు, చేపల శరీరాల్లో నీళ్లు ఎక్కువగా ఉంటాయి. వాటిని వండేటప్పుడు వాటిలోని నీరంతా పోయి అవి నూనెను బాగా పీల్చుకుంటాయి. మాంసంలో కండరాల పోగుల మధ్య కొవ్వు పేరుకుని ఉంటుంది. దీని తొలగించడం సాధ్యం కాదు. ఏమాత్రం నూనె వాడకుండా గ్రిల్లింగ్ వంటి పద్దతుల్లో వండిన మాంసాన్ని తీసుకోవడం మంచిది. అలాగే మేక మెదడు విషయానికి వస్తే దానిలో కొవ్వు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి షుగర్ ఉన్న వారు దానికి చాలా చాలా దూరంగా ఉండాలి.