Hyderabadi Dum Kichdi : హైదరాబాదీ దమ్ కిచిడీ.. ఈ కిచిడీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని దాల్చా, రైతా, చికెన్, మటన్ కర్రీలు, మసాలా వంటకాలతో తింటే చాలారుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. కిచిడీని ఎక్కువగా మనం పెసరపప్పుతో తయారు చేస్తూ ఉంటాము. తరుచూ చేసే కిచిడీతో పాటు ఇలా వెరైటీగా దమ్ కిచిడీని కూడా తయారు చేసి తీసుకోవచ్చు. ఎవరైనా చాలా తేలికగా ఈ కిచిడీని తయారు చేసుకోవచ్చు. ఘుమఘుమలాడుతూ రుచిగా, కమ్మగా ఉండే హైదరాబాదీ దమ్ కిచిడీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాదీ దమ్ కిచిడీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – పావు కప్పు, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 6, బిర్యానీ ఆకు – 1, లవంగాలు – 5, యాలకులు – 6, నల్ల యాలక్కాయ – 1, సాజీరా – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, గంటపాటు నానబెట్టిన ఎర్రకందిపప్పు – ఒక కప్పు, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత,నీళ్లు – మూడున్నర కప్పులు, తరిగిన పుదీనా – ఒక కట్ట, తరిగిన కొత్తిమీర – ఒక కట్ట, గంట పాటు నానబెట్టిన బియ్యం – ఒకటిన్నర కప్పు.
హైదరాబాదీ దమ్ కిచిడీ తయారీ విధానం..
ముందుగా అడుగు మందంగా ఉండే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత మసాలా దినుసులు వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత ఎర్ర కందిపప్పు వేసి వేయించాలి. పప్పు కమ్మటి వాసన వచ్చే వరకు వేయించిన తరువాత పసుపు, ఉప్పు, నీళ్లు, పుదీనా , కొత్తిమీర వేసి కలపాలి. తరువాత బియ్యం వేసి కలపాలి. ఇప్పుడు దీనినై మూత పెట్టి మధ్యస్థ మంటపై 12 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత మూత తీసి దీనిపై టిష్యూ పేపర్ లను ఉంచి పైన నీటిని చల్లుకోవాలి.తరువాత మూత పెట్టి చిన్న మంటపై 12 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని కదిలించకుండా 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే హైదరాబాదీ దమ్ కిచిడీ తయారవుతుంది.ఈ కిచిడీని నేరుగా తిన్నా లేదా ఏ కర్రీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.