Idiyappam : సాధారణంగా చాలా మంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో వివిధ రకాల ఆహారాలను తింటుంటారు. ఇడ్లీలు, దోశలు, ఊతప్పం, చపాతీ ఇలా వివిద రకాలైన ఆహారాలను ఉదయం అల్పాహారంగా తింటుంటారు. అయితే ఇలా ఉదయం తినే అల్పాహారాల్లో ఇడియప్పం కూడా ఒకటి. దీన్ని తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లో ఎక్కువగా తింటుంటారు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. పైగా దీన్ని తినడం వల్ల మనకు పోషకాలు కూడా లభిస్తాయి. దీన్ని తయారు చేయడం కూడా సులభమే. ఇడియప్పంను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇడియప్పం తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం పిండి – 2 కప్పులు, ఉప్పు – తగినంత, కొబ్బరి తురుము – కప్పు.

ఇడియప్పంను తయారు చేసే విధానం..
ఒక కప్పు నీళ్లలో ఉప్పు వేసి మరిగించాలి. తరువాత దాన్ని దించి అందులోకి బియ్యం పిండి కొంచెం కొంచెంగా వేస్తూ కలపాలి. చిన్న ఉండలు కట్టినా తరువాత చేత్తో మెదుపుతూ పిండిని మెత్తగా కలపాలి. ఇప్పుడు ఈ ముద్దను మన కారప్పూస గిద్దల్లో పెట్టాలి. ఇడ్లీ పాత్ర తీసుకుని ఒక్కో రేకులో నెయ్యి రాసి దాని మీద పలుచగా కొబ్బరి తురుము చల్లాలి. ఆపైన కారప్పూస గిద్దల్లో ఉన్న బియ్యం పిండిని కారప్పూస చక్రంలా గుండ్రంగా వత్తాలి. ఆపైన మళ్లీ ఒక్కోదాని మీద కాస్త కొబ్బరి తురుము చల్లాలి. ఇలాగే అన్ని రేకుల్లో వత్తి ఇడ్లీ కుక్కర్‌లో పెట్టి ఇడ్లీల మాదిరిగానే ఉడికించి తీయాలి. రైస్ సేమ్యాలా ఉండే ఇడియప్పం రెడీ అవుతుంది. వీటిని తీసి ఏదైనా మసాలా కూరతో తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.