కలలు కనని మనిషి ఉండనే ఉండడు అంటే అతిశయోక్తి కాదు. ఒక అధ్యయనం ప్రకారం ప్రతి ఒక్కరూ నిద్రించే సమయంలో 2 నుండి 3 కలలు కంటారట. కొన్ని కలలను మనం ఉదయం మంచం మీది నుండి దిగే లోపే మరిచి పోతుంటాము. కలలు కనే సమయం 20 సెకన్ల నుండి 20 లేదా 30 నిమిషాల వరకు కూడా ఉంటుంది. అలాగే మనుషులతోపాటు జంతువులు కూడా కలలు కంటాయట. ఇలా పుట్టిందే సింహస్వప్నం అనే మాట.
అదే విధంగా కళ్లులేని వారికి కూడా కలలు వస్తాయి. అయితే వారి కలలో ఎటువంటి దృశ్యం కనిపించకుండా కేవలం శబ్దాలు మాత్రమే వినిపిస్తాయట. కలలు వాటి అర్థాల గురించి స్కంధ పురాణంలోని స్వప్న శాస్త్రంలో పేర్కొనబడింది. అలాగే అగ్ని పురాణంలో కూడా కలల గురించి కొంత వివరణ ఉంది. మన జీవితంలో గత వారం రోజుల పాటు జరిగిన సంఘటనల ఆధారంగానే మనకు 90 శాతం కలలు వస్తాయని ఇటీవల జరిగిన ఒక పరిశోధనలో వెల్లడైంది.
ఒక్కోసారి మనం ఏదైనా ఎత్తైన ప్రదేశం నుండి పడిపోయి చనిపోయినట్టు కలలు వస్తాయి. ఆ విధంగా కల వచ్చిన వెంటనే మనం మేల్కొంటాము. మనం చనిపోయిన తరువాత మన మెదడకు ఎటువంటి సంఘటనలు సృషించాలో తెలియక ఆ కల అక్కడితో ఆగిపోయి మనకు మెళకువ వస్తుంది. దీనినే పీడ కల అని అంటారు. ఒక్కోసారి మన కలలు మన నిత్య జీవితంలో నిజంగా జరుగుతుంటాయి. మనం కనే కలలు మన జీవితంలో జరగబోయే వాటికి దేవుడు పంపిస్తున్న సంకేతాలని మన పురాణాలు చెబుతున్నాయి.
కలలను బట్టి మన భవిష్యత్తును ఎలా అంచనా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కలలో సముద్రం కనిపిస్తే భవిష్యత్తులో కష్టాలు వస్తాయట. సూర్యోదయం కనిపిస్తే మనం అనుకున్న పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగుతాయట. పై నుండి కిందికి పడిపోతున్నట్టు కల వస్తే త్వరలోనే ఏదో పెద్ద సమస్య మనల్ని చుట్టూ ముట్టబోతోందని అర్థమట. సంతానం లేని వారికి కలలో పండ్లు, పండ్ల తోటలు కనిపిస్తే త్వరలో వారికి సంతానం కలగబోతోందని అర్థమట.
కలలో కాళ్లు, చేతులు కడిగినట్టు కనిపిస్తే త్వరలోనే మీ దరిద్రం అంతా పోయి అదృష్టవంతులు కాబోతున్నారని అర్థమట. అలాగే కలలో విష స్పరాలు, కోతి, గుడ్లగూబ శబ్దాలు, అదే విధంగా గాడిద పైకి ఎక్కినట్టు కనిపిస్తే ఏదో అశుభానికి సూచికగా భావించాలట. పీడ కలలు వచ్చినప్పుడు వెంటనే నిద్రలేచి కాళ్లు, చేతులు కడుకుని ఇష్ట దైవాన్ని స్మరించుకుని నిద్రపోవాలి. ఇలా చేయడం వల్ల ఆ పీడకల ప్రభావం కొంతవరకైనా తగ్గుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే కలలు వచ్చే సమయాన్ని బట్టి అవి ఎప్పుడు జరగబోతాయో కూడా చెప్పవచ్చని పండితులు చెబుతున్నారు.
కల మొదటి జాములో వస్తే అది ఏడాదిలోపు జరుగుతుందట. రెండో జాము లోపు కల వస్తే ఆరు నెలలలోపున, మూడో జామున కల వస్తే మూడు నెలలలోపున, నాలుగో జాములో కల వస్తే పదిహేను రోజుల లోపున ఆ కలల ఫలితాలు మనకు కనిసిస్తాయట. వేకువ జామున కల వస్తే అది పది రోజులు లేదా అంతకంటే తక్కువ సమయంలోపునే జరుగుతుందట. అందుకే వేకువ జామున వచ్చిన కలలు నెరవేరుతాయని మన పెద్దలు చెబుతుంటారు. ఈ విధంగా కలలు మన భవిష్యత్తును తెలియజేస్తాయని నిపుణులు చెబుతున్నారు.