మనలో చాలా మందిని వేధించే అనారోగ్య సమస్యల్లో మతిమరుపు సమస్య కూడా ఒకటి. వస్తువును పెట్టిన పది నిమిషాల్లోనే ఆ వస్తువును ఉంచిన స్థానాన్ని మరిచిపోయే వారు చాలా మందే ఉంటారు. అలాగే చదివిన విషయాలు గుర్తుండక బాధపడే విద్యార్థులు కూడా ఉంటారు. వీట్నింటికీ కారణం మన జ్ఞాపక శక్తి తక్కవగా ఉండడమే. కొన్ని రకాల చిట్కాలను వాడి మతిమరుపు సమస్య నుండి మనం బయట పడవచ్చు.
బాదం పప్పు జ్ఞాపకశక్తిని పెంచడంలో చక్కగా పనిచేస్తుంది. రోజూ నానబెట్టి పొట్టు తీసిన బాదం గింజలను తినడం వల్ల మెదడు చురుకుగా పని చేసి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే నెయ్యిలో కూడా జ్ఞాపక శక్తిని పెంచే గుణం ఉంటుంది. ప్రతిరోజూ ఆహారంలో భాగంగా నెయ్యిని తీసుకోవడం వల్ల కూడా మతిమరుపు సమస్య తగ్గుతుంది. జ్ఞాపక శక్తిని పెంచడంలో సోంపు గింజలు మనకు ఎంతో సహాయపడతాయి. సోంపు గింజలు, ధనియాలు, యాలకులు, పటిక బెల్లం వీటన్నింటిని సమపాళ్లలో తీసుకుని పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని పాలలో కలుపుకుని రోజూ రాత్రి పడుకునే ముందు తాగడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
చాలా మంది కాఫీ, చాక్లెట్ ఆరోగ్యానికి హానికరం అనుకుంటారు. కానీ వీటిలో జ్ఞాపక శక్తిని పెంచే శక్తి ఉంటుంది. చాకొలెట్, కాఫీ తీసుకునే వారిలో ఇతరుల కంటే జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆహారంలో పాలకూర, టమాట, బీట్ రూట్ ఉండేలా చూసుకోవాలి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మతిమరుపు సమస్య నుండి బయటపడవచ్చు. ఈ ఆహార పదార్థాలను తీసుకోవడంతోపాటు మన జీవన విధానంలో కూడా కొద్దిపాటి మార్పులను చేసుకోవాలి.
రోజూ వేకువ జామున నాలుగు గంటలకు లేచి చదవాలి. ఆ సమయంలో మన మెదడు చాలా ప్రశాంతంగా ఉంటుంది కనుక మనం చదివిన విషయాలు చక్కగా గుర్తుంటాయి. అలాగే గంటల కొద్దీ విరామం లేకుండా చదవకూడదు. మధ్య మధ్యలో విరామాన్ని తీసుకుంటూ చదవాలి. అలాగే కొద్ది సేపు ప్రశాంతంగా కూర్చొని చదివిన విషయాలను మననం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చదివిన విషయాలు సులువుగా గుర్తుంటాయి. కొంతమంది అసలు నిద్రించకుండా చదువుతుంటారు. ఈ విధంగా అస్సలు చేయకూడదు. నిద్రించకుండా చదవడం వల్ల మెదడు మీద ఒత్తిడి పెరిగి చదివిన విషయాలను కూడా మరిచిపోయే అవకాశం ఉంటుంది.
కనుక రోజులో 6 నుండి 8 గంటల పాటు కచ్చితంగా నిద్రపోవాలి. అప్పుడే మన మెదడు చురుకుగా పని చేస్తుంది. వీటితోపాటు చెస్ ఆడడం, క్లిష్టమైన పజిల్స్ ను పరిష్కరించడం, మెదడుకు పదును పెట్టే పనులు చేయడం వంటివి చేస్తూ ఉండాలి. ఈ చిట్కాలను పాటించడం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి మతిమరుపు సమస్య మన దరి చేరకుండా ఉంటుంది.