Kaju Shake : జీడిపప్పు.. దీనిని మనం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. జీడిపప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. దీనిలో ఎన్నో రకాల పోషకాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. జీడిపప్పు ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. జీడిపప్పును నానబెట్టి తీసుకోవడంతో పాటు దీనిని వంటల్లో కూడా విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాము. అంతేకాకుండా ఈ జీడిపప్పుతో ఎంతో రుచిగా ఉండే కాజు షేక్ ను కూడా తయారు చేసుకోవచ్చు. కాజు షేక్ చాలా రుచిగా ఉంటుంది. వేసవి కాలంలో తాగడానికి ఇది ఒక చక్కటి పానీయం అని చెప్పవచ్చు. ఈ కాజు షేక్ ను తయారు చేయడం చాలా సులభం. ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, చల్లగా ఉండే కాజు షేక్ ను ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కాజు షేక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
జీడిపప్పు – 80 గ్రా., వేడి పాలు – పావు లీటర్, పాలు – 750 ఎమ్ ఎల్, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, పంచదార – 80 గ్రా., యాలకుల పొడి – 2 చిటికెలు,ఫ్రెష్ క్రీమ్ – పావు కప్పు.
కాజు షేక్ తయారీ విధానం..
ముందుగా పావు లీటర్ పాలల్లో జీడిపప్పు వేసి గంట పాటు నానబెట్టాలి. తరువాత ఈ జీడిపప్పును పాలతో సహా జార్ లో వేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో పాలు పోసి వేడి చేయాలి. పాలు ఒక పొంగు వచ్చిన తరువాత మిక్సీ పట్టుకున్న కాజు పేస్ట్ వేసి కలపాలి. దీనిని ఉండలు లేకుండా కలుపుకుంటూ ఒక పొంగు వచ్చే వరకు వేడి చేయాలి. తరువాత కార్న్ ఫ్లోర్ లో రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. పాలు పొంగు వచ్చిన తరువాత ఈ కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని వేసి కలపాలి. అలాగే పంచదార కూడా వేసి కలపాలి. దీనిని కలుపుతూ మరో పొంగు వచ్చే వరకు మరిగించిన తరువాత యాలకుల పొడి వేసి కలపాలి. తరువాత దీనిని గిన్నెలో పోసి పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత ఈ మిశ్రమాన్ని రెండు గంటల పాటు డీప్ ఫ్రీజర్ లో ఉంచాలి.
రెండు గంటల తరువాత ఈ మిశ్రమాన్ని బ్లెండర్ లో వేసుకోవాలి. ఇందులోనే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకుని అర నిమిషం పాటు హై స్పీడ్ మీద బ్లెండ్ చేసుకోవాలి. తరువాత ఒక గ్లాస్ లో ముందుగా నానబెట్టిన జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. తరువాత కాజు షేక్ ను పోయాలి. చివరగా మరో కొన్ని కాజు పలుకులతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కాజు షేక్ తయారవుతుంది. దీనిని తాగడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. అలాగే వేసవి నుండి ఉపశమనాన్ని కూడా పొందవచ్చు.