Mango Jam : మనకు మార్కెట్ లో వివిధ రకాల పండ్లతో చేసిన జామ్ లు లభిస్తూ ఉంటాయి. మనకు లభించే వాటిల్లో మ్యాంగో జామ్ కూడా ఒకటి. ఈ మ్యాంగో జామ్ ఎంతో రుచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ మ్యాంగో జామ్ ను మనం ఇంట్లో కూడా చాలా సులువుగా బయట దొరికే విధంగా తయారు చేసుకోవచ్చు. ప్రస్తుతం మనకు మామిడి పండ్లు అధికంగా లభిస్తూ ఉంటాయి. కనుక ఇలా మామిడి పండ్లు దొరికినప్పుడే వీటితో జామ్ ను చేసుకుని మనం నిల్వ చేసుకోవచ్చు. బయట దొరికే విధంగా మామిడి పండ్లతో జామ్ ను ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
మ్యాంగో జామ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బాగా పండిన మామిడికాయలు – 2 (మధ్యస్థంగా ఉన్నవి), పంచదార – అర కప్పు, నిమ్మరసం – అర టీ స్పూన్.
మ్యాంగో జామ్ తయారీ విధానం..
ముందుగా మామిడి పండ్లపై ఉండే పొట్టును తీసి ముక్కలుగా చేసుకోవాలి. ఈ ముక్కలను ఒక జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీనిని ఒక మందపాటి కళాయిలో వేసి పెద్ద మంటపై అడుగంటకుండా కలుపుతూ 10 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత పంచదారను, నిమ్మరసాన్ని వేసి కలుపుతూ మరో 15 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత మామిడి పండ్ల గుజ్జు రంగు మారడాన్ని మనం గమనించవచ్చు. ఈ మిశ్రమాన్ని జెల్లీలా అయ్యే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యే వరకు ఉంచాలి. ఇలా చేయడం వల్ల బయట దొరికే విధంగా ఉండే మ్యాంగో జామ్ తయారవుతుంది. ఈ మిశ్రమం చల్లారిన తరువాత మూత ఉండే గాజు సీసాలో నిల్వ ఉంచి ఫ్రిజ్ లో పెట్టి నిల్వ చేసుకోవడం వల్ల పాడవకుండా 3 నెలల పాటు తాజాగా ఉంటుంది. ఈ మ్యాంగో జామ్ ను నేరుగా కూడా తినవచ్చు లేదా బ్రెడ్, చపాతీ వంటి వాటితో కలిపి కూడా తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. పైగా పోషకాలు కూడా లభిస్తాయి.