Onion Pachadi : మనం వంటింట్లో రకరకాల పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా, రుచిగా చేసుకోదగిన పచ్చళ్లల్లో ఉల్లిపాయ పచ్చడి కూడా ఒకటి. ఉల్లిపాయను మనం ఎక్కువగా వంటల్లో వాడుతూ ఉంటాము. ఉల్లిపాయను ఉపయోగించడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. వంటల్లో వాడే ఈ ఉల్లిపాయతో మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడిని కేవలం 10 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఎంతో కమ్మగా ఉండే ఉల్లిపాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టీ స్పూన్స్, ధనియాలు – అర టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, మినపగుళ్లు – 3 టీ స్పూన్స్, ఎండుమిర్చి – 10 లేదా కారానికి తగినన్ని, పెద్ద ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయలు – 3 ( మధ్యస్థంగా ఉండేవి), నువ్వులు – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 8, అల్లం – ఒక ఇంచు ముక్క, కరివేపాకు – ఒక రెమ్మ, చింతపండు – చిన్న నిమ్మకాయంత, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – గుప్పెడు.
ఉల్లిపాయ పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ధనియాలు, మెంతులు, జీలకర్ర వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత మినపగుళ్లు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి వేసి వేయించాలి. ఎండుమిర్చి చక్కగా వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను మెత్తబడే వరకు వేయించిన తరువాత నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, కరివేపాకు, చింతపండు వేసి కలపాలి. వీటిని మరో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ దినుసులున్నీ చల్లారిన తరువాత వీటిని జార్ లోకి తీసుకుని మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి.
తరువాత ఉప్పు, కొత్తిమీర వేసి మరోసారి మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో పాటు అల్పాహారాలతో కూడా దీనిని తినవచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా ఉల్లిపాయలతో ఎంతో రుచిగా పచ్చడిని తయారు చేసుకుని తినవచ్చు. ఈ పచ్చడిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.