Pudina Podi : పుదీనాను మనం సాధారణంగా రోజూ పలు రకాల వంటల్లో వేస్తుంటాం. పుదీనా చక్కని వాసన, రుచిని కలిగి ఉంటుంది. అయితే ఆయుర్వేద ప్రకారం పుదీనా మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. దీంతో పొడి చేసి రోజూ అన్నంలో మొదటి ముద్దలో తింటే ఎన్నో లాభాలను పొందవచ్చు. ఈ క్రమంలోనే పుదీనా పొడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పుదీనా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పుదీనా ఆకులు – రెండు కప్పులు, ఎండు మిర్చి – 15, ధనియాలు – అర కప్పు, మినప పప్పు – పావు కప్పు, నూనె – మూడు టీస్పూన్లు, చింత పండు – రుచి కోసం తగినంత, ఉప్పు – తగినంత.

పుదీనా పొడిని తయారు చేసే విధానం..
పుదీనా ఆకులను శుభ్రం చేసి తడి లేకుండా గాలికి బాగా ఆరబెట్టాలి. బాణలిలో నూనె కాగిన తరువాత ఎండు మిర్చి, ధనియాలు, మినప పప్పు వేసి దోరగా వేయించాలి. తరువాత అందులోనే పుదీనా ఆకులు వేసి పళపళమనే వరకు వేయించాలి. మిశ్రమం చల్లారిన తరువాత చింతపండు, ఉప్పు కలిపి మెత్తగా దంచుకోవాలి. ఈ పొడిని అన్నంతోపాటు ఇడ్లీ, దోశ, ఊతప్పం, ఉప్మా వంటి బ్రేక్‌ఫాస్ట్‌లతో కూడా కలిపి తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని అందరూ ఇష్టంగా తింటారు.