Ragi Soup : మనం రాగి పిండితో జావతో పాటు రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాము. రాగిపిండితో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని పొందవచ్చు. రాగిపిండితో తరుచూ ఒకేరకం వంటకాలు కాకుండా మనం సూప్ ను కూడా తయారు చేసుకోవచ్చు. రాగి సూప్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. బరువు తగ్గాలనుకునే వారు దీనిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించేలా రాగిపిండితో సూప్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి సూప్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన టమాట – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, చిన్నగా తరిగిన క్యారెట్ – 1, చిన్నగా తరిగిన బీన్స్ – 10, చిన్నగా తరిగిన వెల్లుల్లి రెమ్మలు – 2, చిన్నగా తరిగిన అల్లం – ఒక చిన్న ముక్క, నెయ్యి – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, నీళ్లు – 3 కప్పులు, ఉప్పు – తగినంత, రాగిపిండి – 3 టీ స్పూన్స్, మిరియాల పొడి – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – ఒక టేబుల్ స్పూన్, నిమ్మరసం – అర చెక్క.
రాగి సూప్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, బీన్స్ వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాతటమాట ముక్కలు వేసి వేయించాలి. టమాట ముక్కలు మెత్తబడిన తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత ఉప్పు వేసి కలపాలి. నీళ్లని 7 నుండి 8 నిమిషాల పాటు బాగా మరిగించిన తరువాత ఒక గిన్నెలో రాగిపిండిని తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. తరువాత ఈ రాగిపిండిని మరుగుతున్న నీటిలో వేసి కలపాలి. దీనిని కొద్దిగా చిక్కబడే వరకు మరిగించిన తరువాత మిరియాల పొడి వేసి కలపాలి. దీనిని మరో 2 నిమిషాల పాటు మరిగించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చివరగా కొత్తిమీర, నిమ్మరసం వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రాగి సూప్ తయారవుతుంది. ఈ విధంగా తయారు చేసిన రాగి సూప్ ను తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.