Restaurant Style Egg Fried Rice : మనకు రెస్టారెంట్ లో లభించే వివిధ రకాల రుచికరమైన ఫ్రైడ్ రైస్ లల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా ఒకటి. రెస్టారెంట్ లలో లభించే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. మరీ స్పైసీగా లేకుండా చూడడానికి చక్కగా ఎంతో రుచిగా ఈ ఫ్రైడ్ రైస్ ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ రెస్టారెంట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ ను మనం ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా తేలిక. నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు, వెరైటీగా కావాలని పిల్లలు అడిగినప్పుడు ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ ను తయారు చేసి ఇవ్వవచ్చు. రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బాస్మతీ బియ్యం – ఒక గ్లాస్, చిన్నగా తరిగిన బీన్స్ – 10, చిన్నగా తరిగిన క్యారెట్ – 1, చిన్నగా తరిగిన క్యాప్సికం- 1, క్యాబేజి తురుము – ఒక కప్పు, స్ప్రింగ్ ఆనియన్స్ – కొద్దిగా, నూనె- 3 టేబుల్ స్పూన్స్, కోడిగుడ్లు – 3, చిన్నగా తరిగిన వెల్లుల్లి తరుగు – ఒక టేబుల్ స్పూన్, తరిగిన అల్లం – ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, ఉప్పు – తగినంత, సోయా సాస్ – 2 టీ స్పూన్స్, మిరియాల పొడి – ఒక టీ స్పూన్.
రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం..
ముందుగా బియ్యాన్ని పొడి పొడిగా ఉడికించి ఆరబెట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత కోడిగుడ్లు వేసి వేయించాలి. కోడిగుడ్లు వేగిన తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో మరికొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తరువాత వెల్లుల్లి, అల్లం తరుగు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. తరువాత బీన్స్, క్యారెట్, క్యాప్సికం, క్యాబేజి తురుము, ఉప్పు వేసి కలపాలి. వీటిని మెత్తబడే వరకు వేయించిన తరువాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసి కలపాలి.
వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత సోయా సాస్ వేసి కలపాలి. తరువాత వేయించిన కోడిగుడ్లు, అన్నం, మిరియాల పొడి వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత పైనుండి మరికొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ ను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా ఇంట్లోనే చాలా సులభంగా రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ను తయారు చేసి తీసుకోవచ్చు.