RRR Movie : రాజమౌళి దర్శకత్వంలో ఎన్‌టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీని జనవరి 7వ తేదీన విడుదల చేయాల్సి ఉంది. అయితే ఈ మూవీ విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
కరోనా ఒమిక్రాన్ వేరియెంట్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో థియేటర్లను మూసి వేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఆంక్షలను విధించారు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాను విడుదల చేసి కోరి నష్టాలను తెచ్చుకోవడం ఎందుకని భావించిన చిత్ర యూనిట్ ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
గతంలో ఈ మూవీని అక్టోబర్ 13న దసరా సందర్భంగా విడుదల చేయాలని భావించారు. కానీ జనవరి 7కు వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ మూవీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఒక దశలో ఈ సినిమాను ఈ ఏడాది వేసవిలో విడుదల చేయాలని భావించారు. కానీ అప్పటి వరకు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. కనుక చిత్ర విడుదలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
కాగా ఆర్ఆర్ఆర్ విడుదల వాయిదా నేపథ్యంలో సినీ అభిమానులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. తాము ఎంతో కాలంగా ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని.. మూవీ ట్రైలర్ కూడా విడుదలైందని, విడుదల పక్కా అని భావిస్తుండగా.. చిత్ర యూనిట్ తీసుకున్న ఈ నిర్ణయం తమను నిరాశకు గురి చేస్తుందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
అయితే ఆర్ఆర్ఆర్ కోసం ఇప్పటికే భీమ్లా నాయక్, ఇతర చిత్రాలను వాయిదా వేశారు. మరి ఆ సినిమాల పరిస్థితేమిటని చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఆర్ఆర్ఆర్ యూనిట్ తీసుకున్న ఈ నిర్ణయం అటు ఇండస్ట్రీ వర్గాలతోపాటు ఇటు సినీ ప్రేక్షకులను కూడా నిరాశకు, అసంతృప్తికి గురి చేస్తుందని చెప్పవచ్చు.