Sherva : మనం అప్పుడప్పుడూ ఇంట్లోనే పులావ్, బిర్యానీ, నాన్, చపాతీ వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. అలాగే వీటిని తినడానికి షేర్వాను కూడా తయారు చేస్తూ ఉంటాం. షేర్వాతో కలిపి తింటే బిర్యానీ, పులావ్ ల రుచి మరింత పెరుగుతుంది. ఎంతో రుచిగా ఉండే ఈ షేర్వాను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. రుచిగా, సులభంగా, చాలా తక్కువ సమయంలో అయ్యేలా షేర్వాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
షేర్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
వేయించి పొట్టు తీసిన పల్లీలు – అర కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు – అర కప్పు, నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ – పావు కప్పు, నూనె – పావు కప్పు, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – ముప్పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, టమాట ఫ్యూరీ – ముప్పావు కప్పు, కరివేపాకు – రెండు రెమ్మలు, నీళ్లు – అర లీటర్.
షేర్వా తయారీ విధానం..
ముందుగా కళాయిలో కొబ్బరి ముక్కలు వేసి మాడిపోకుండా వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత నువ్వులు వేసి దోరగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. అలాగే వేయించిన పల్లీలు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి తగినన్ని నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసుకుని వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయిన తరువాత గరం మసాలా, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి వేయించుకోవాలి.
తరువాత టమాట ఫ్యూరీ, కరివేపాకు వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న మసాలా మిశ్రమం, నీటిని పోసి కలపాలి. తరువాత దీనిని మధ్యస్థ మంటపై 20 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే షేర్వా తయారవుతుంది. దీనిని చపాతీ, పులావ్, బిర్యానీ, నాన్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.