Soft Pakoda : ఉల్లిపాయలతో చేసే వంటకం అనగానే అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది పకోడి. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. సాయంత్రం సమయాల్లో టీ తాగుతూ పకోడి తినడానికి చాలా మంది ఇష్టపడతారు. కొందరూ కరకరలాడుతూ ఉండే పకోడీలను తినడానికి ఇష్టపడితే కొందరు మెత్తని పకోడీలను తినడానికి ఇష్టపడతారు. మెత్తగా ఉండే ఈ పకోడీలు కూడా చాలా రుచిగా ఉంటాయి. ఇవి కూడా మనకు స్వీట్ షాపుల్లో లభ్యమవుతూ ఉంటాయి. ఎంతో రుచిగా ఉండే ఈ మెత్తని పకోడీలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సాఫ్ట్ పకోడి తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – ఒక కప్పు, తరిగిన ఉల్లిపాయలు – అర కప్పు, అల్లం తరుగు – 2 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – రెండు రెమ్మలు, జీలకర్ర – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, వంటసోడా – పావు టీ స్పూన్, పసుపు – చిటికెడు, నీళ్లు – ముప్పావు కప్పు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
సాఫ్ పకోడి తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో ఉల్లిపాయలు, అల్లం తరుగు, ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, వంటసోడా వేసి కలుపుకోవాలి. తరువాత శనగపిండి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీటిని పోసుకుంటూ పిండిని మామూలు పకోడీల పిండి కంటే కొద్దిగా పలుచగా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పిండిని తీసుకుని పకోడీలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా కాలిన తరువాత గంటెతో కదుపుతూ ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సాఫ్ట్ పకోడీ తయారవుతుంది. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా ఇలా సాఫ్ట్ పకోడీని తయారు చేసుకుని తినవచ్చు. వీటిని అందరూ ఇష్టంగా తింటారు. తరచూ చేసే పకోడీలకు బదులుగా ఇలా మెత్తని పకోడీలను కూడా చేసుకుని తినవచ్చు.