Sorakaya Kura : మనకు అందుబాటులో ఉండే అత్యంత చవక ధర కలిగిన కూరగాయల్లో సొరకాయలు ఒకటి. ఇవి మనకు ఏడాది పొడవునా లభిస్తాయి. సొరకాయలను చాలా మంది సాంబార్‌లో వేస్తుంటారు. అయితే చాలా మంది వీటిని తినేందుకు అంతగా ఇష్టపడరు. కానీ సొరకాయతో మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. మనకు వచ్చే అనేక వ్యాధులు నయం కావడంలో మనకు సొరకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే దీన్ని రుచికరంగా ఉండేలా కూడా తయారు చేయవచ్చు. సొరకాయను ఇలా కూరగా చేసి తింటే.. ఇది అంటే ఇష్టం లేని వారు సైతం ఎంతో ఇష్టంగా తింటారు. ఇక సొరకాయ కూరను ఎలా వండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సొరకాయ కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
సొరకాయ – అరకిలో, పచ్చిమిర్చి – 5, ఆవాలు – 2 టేబుల్‌స్పూన్లు, కొబ్బరి తురుము – 1 కప్పు, బియ్యం – పావు కప్పు, నువ్వులు – 1 కప్పు, కారం – 1 టీస్పూన్, నూనె – సరిపడా, ఉప్పు – తగినంత.
సొరకాయ కూరను తయారు చేసే విధానం..
సొరకాయను తొక్కుతీసి ముక్కలుగా కోయాలి. పచ్చి వాసన పోయే వరకు ముక్కల్ని ఉడికించి దించేయాలి. తర్వాత నీరు వంపేయాలి. బియ్యం, నువ్వులు విడివిడిగా గంట చొప్పున నానబెట్టాలి. తర్వాత ఈ రెండింటినీ రెండు టీస్పూన్ల ఆవాలు, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు చేర్చి రుబ్బాలి. కడాయిలో నూనె వేసి కొద్దిగా ఆవాలు వేసిన తర్వాత సొరకాయ ముక్కలు వేసి 10 నిమిషాలు వేయించాలి. తర్వాత బియ్యం, నువ్వులు అన్నీ కలిపి రుబ్బిన మిశ్రమాన్ని వేసి బాగా కలిపి ఒక టీస్పూన్ కారం వేసి మూతపెట్టి పది నిమిషాలపాటు సన్నని సెగపై ఉంచి ఉడికించాలి. చివరగా కొంచెం కొత్తిమీర చల్లి దింపేయాలి. దీంతో సొరకాయ కూర రెడీ అవుతుంది. రెగ్యులర్‌గా వండే కూరకు బదులుగా ఇలా చేస్తే ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. దీన్ని అన్నం లేదా చపాతీ దేంతో తిన్నా.. భలే రుచిగా ఉంటుంది.