Stuffed Banana Bajji : మనం స్నాక్స్ గా తీసుకునే వాటిల్లో బజ్జీలు కూడా ఒకటి. బజ్జీలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే మనం మన రుచికి తగినట్టు వివిధ రుచుల్లో ఈ బజ్జీలను తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన బజ్జీ వెరైటీలలో అరటికాయ బజ్జీలు కూడా ఒకటి. అరటికాయ బజ్జీలు చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి ఇవి కూడా చాలా చక్కగా ఉంటాయి. ఈ బజ్జీలలో స్టఫింగ్ చేసి మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే స్టఫ్డ్ బనానా బజ్జీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
స్టఫ్డ్ బనానా బజ్జీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి అరటికాయ – 1, శనగపిండి – ఒక కప్పు, బియ్యంపిండి – ఒక టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, వాము – ఒక టీ స్పూన్, వంటసోడా – చిటికెడు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – పెద్దది ఒకటి, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నిమ్మరసం – అర చెక్క, వేయించిన పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్.
స్టఫ్డ్ బనానా బజ్జీ తయారీ విధానం..
ముందుగా పచ్చి అరటికాయను తీసుకుని దానిపై ఉండే చెక్కును సగం మాత్రమే తొలగించాలి. అరటికాయపై కొద్దిగా పచ్చటి చెక్కు ఉండేలా చూసుకోవాలి. తరువాత వీటిని అడ్డంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను ఉప్పు నీటిలో వేసి 5 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత ఒక గిన్నెలో శనగపిండి, ఉప్పు, బియ్యం పిండి, వాము, కారం, పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసుకుంటూ బజ్జీ పిండిలా కలుపుకోవాలి. తరువాత వంటసోడా వేసి కలుపుకోవాలి. తరువాత అరటికాయ ముక్కలను బయటకు తీసుకుని తడి పోయేలా తుడుచుకోవాలి. తరువాత ఈ ముక్కలను పిండిలో ముంచి వేడి వేడి నూనెలో వేసుకోవాలి.
ఈ బజ్జీలను మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ బజ్జీలను నేరుగా టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని స్టప్ చేసుకుని కూడా తినవచ్చు. దీని కోసం ఒక గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం, కొద్దిగా ఉప్పు, కారం, కొత్తిమీర, పల్లీలు వేసి కలపాలి. తరువాత బజ్జీలను మధ్యలో నిలువుగా కట్ చేసి అందులో ఈ స్టఫింగ్ ను ఉంచి సర్వ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే స్టఫ్డ్ బజ్జీలు తయారవుతాయి. తరచూ ఒకేరకంగా కాకుండా ఇలా అరటికాయలతో బజ్జీలను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.