Suresh Raina : బెంగళూరులో తాజాగా జరిగిన ఐపీఎల్ మెగా వేలం 2022లో 10 జట్లు తమకు నచ్చిన ప్లేయర్లను భారీ ధరలకు కొనుగోలు చేసిన విషయం విదితమే. అయితే చెన్నై జట్టు ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ జట్టు పాత ప్లేయర్లు అందరినీ దాదాపుగా వేలంలో కొనుగోలు చేసింది. కానీ కీలక ప్లేయర్ సురేష్ రైనాను మాత్రం కొనుగోలు చేయలేదు. రైనా వాస్తవానికి ఎన్నో మ్యాచ్‌లలో చెన్నైకి విజయాలను అందించాడు. ఒంటి చేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పే సత్తా ఉన్న ఆటగాడు. అయినప్పటికీ చెన్నై టీమ్ రైనాను కొనుగోలు చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ క్రమంలోనే చెన్నై అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ నిరసన వ్యక్తం చేశారు. సురేష్ రైనాను కొనుగోలు చేయకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు నిరసనగా తాము చెన్నై టీమ్‌ను బహిష్కరిస్తున్నామని.. ఇకపై నుంచి వచ్చే ఐపీఎల్ సీజన్లలో తాము ముంబైకి సపోర్ట్ చేస్తామని హెచ్చరించారు. టీమ్ వద్ద ఇంకా డబ్బులు మిగిలే ఉన్నాయి కనుక రైనాను తీసుకోవాల్సిందేనని పట్టుబట్టారు.
అయితే అభిమానుల నుంచి ఈ స్థాయిలో స్పందనను ఎక్స్‌పెక్ట్ చేయని చెన్నై ఎట్టకేలకు దిగి వచ్చింది. రైనాను ఎందుకు కొనుగోలు చేయలేదో వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. చెన్నై జట్టు సీఈవో కాశీ విశ్వనాథ్ సోమవారం మీడియాతో మాట్లాడారు. తాము సురేష్ రైనాకు అత్యంత గౌరవం ఇచ్చామని, అతను చెన్నైకి ఎన్నో విజయాలను అందించాడని, అందుకు అతనికి కృతజ్ఞతలు చెబుతున్నామని తెలిపారు. ఐపీఎల్‌లో రైనా అద్భుతంగా రాణించాడని, అయితే ప్రస్తుతం అతను ఫామ్ లో లేడని, ఫిట్ గా లేనందువల్లే అతన్ని కొనుగోలు చేయలేదని, అతన్ని కొనడం తమకు ఇబ్బందిగా మారిందని తెలిపారు. అయితే దీనిపై చెన్నై ఫ్యాన్స్ స్పందించాల్సి ఉంది.