Vankaya Masala Curry : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో వంకాయలు కూడా ఒకటి. ఇతర కూరగాయల వలె వంకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. వంకాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో వంకాయ మసాలా కర్రీ కూడా ఒకటి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను అందరూ లొట్టలేసుకుంటూ తింటూ ఉంటారు. ఈ వంకాయ మసాలా కూరను మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. వంటరాని వారు, మొదటి సారి చేసే వారు, బ్యాచిలర్స్ ఇలా ఎవరైనా ఈ కూరను మరింత రుచిగా సులభంగా తయారు చేసుకోవచ్చు. వంకాయ మసాలా కూరను మరింత రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గుత్తి వంకాయ మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
గుత్తి వంకాయలు – పావు కిలో, నూనె – 4 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, దంచిన పచ్చిమిర్చి – 3, శనగపిండి – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, టమాటాలు – 3, గరం మసాలా – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు..
వేయించి పొట్టు తీసిన పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్ , వేయించిన నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 6, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
గుత్తి వంకాయ మసాలా కూర తయారీ విధానం..
ముందుగా వంకాయలను నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకోవాలి. తరువాత టమాటాలను జార్ లో వేసి ఫ్యూరీలాగా చేసుకోవాలి. తరువాత జార్ లో పల్లీలు, నువ్వులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో మిగిలిన మసాలా పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మసాలా మిశ్రమాన్ని వంకాయలల్లో స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వంకాయలను వేసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వంకాయలను వేయించుకోవాలి. వంకాయలు చక్కగా వేగిన తరువాత వాటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు అదే నూనెలో ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత శనగపిండి, రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి కలపాలి.
దీనిని కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత టమాట ఫ్యూరీ వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత వేయించిన వంకాయలను వేసి కలపాలి. ఇప్పుడు గ్రేవికి తగినన్ని నీళ్లు పోసి కలపాలి. దీనిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 8 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత గరం మసాలా, కొత్తిమీర వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ మసాలా కూర తయారవుతుంది. దీనిని అన్నం, బగారా అన్నం వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.