Vankaya Tomato Curry : వంకాయలను మనం ఎంతో కాలంగా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉన్నాం. వంకాయలతో చేసే కూరలు రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. వంకాయలతో ఎక్కువగా వేపుడుతో పాటు వంకాయ టమాట కూరను కూడా తయారు చేస్తూ ఉంటాం. వంకాయ టమాట కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను చాలా మంది ఇష్టంగా తింటారు. టమాట వంకాయ కూరను మనం మరింత రుచిగా, సులభంగా కూడా తయారు చేసుకోవచ్చు. టమాట వంకాయ కూరను మరింత రుచిగా, సులువుగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట వంకాయ కర్రీ తయారీకి కావల్సన పదార్థాలు..
వంకాయలు – పావు కిలో, తరిగిన టమాటాలు – 400 గ్రా., తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, జీలకర్ర – ఒక టీ స్పూన్, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, కరివేపాకు – కొద్దిగా, పసుపు – పావు టీ స్పూన్.
టమాట వంకాయ కర్రీ తయారీ విధానం..
ముందుగా వంకాయలను తరిగి ఉప్పు నీటిలో వేసి పక్కకు పెట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత వంకాయ ముక్కలు వేసి 3 నిమిషాల పాటు వేయించాలి. ఇలా వేయించిన తరువాత టమాట ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు మగ్గించాలి. తరువాత మూత తీసి ద్గర పడే వరకు మధ్యస్థ మంటపై ఉడికించాలి. కూర దగ్గర పడిన తరువాత కారం వేసి కలిపి మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట వంకాయ కూర తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పుల్కా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర తినేటప్పుడు అల్లం ముక్కలు మధ్య మధ్యలో తగులుతూ ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. వంకాయలను ఇష్టపడని వారు ఈ కూరను చాలా ఇష్టంగా తింటారు.