Vasena Poli : వాసెన పోలి.. అల్పాహారంగా తీసుకునే ఈ వాసెన పోలి గురించి మనలో చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఇవి చూడడానికి ఇడ్లీల లాగే ఉన్న వీటి తయారీ విధానం వేరుగా ఉంటుంది. చిరుధాన్యాల్లో సంప్రదాయబద్దంగా చేసే ఈ వాసెనపోలి అంటే మన భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి చాలా ఇష్టం. రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఈ వాసెన పోలిలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వాసెన పోలి తయారీకి కావల్సిన పదార్థాలు..
మినపప్పు – ఒక గ్లాసులు, మెంతులు – ఒక టీ స్పూన్, ఇడ్లీ రవ్వ – ఒక గ్లాస్, కొర్రల రవ్వ – ఒక గ్లాస్, ఉప్పు – తగినంత, విస్తరాకులు – తగినన్ని.
వాసెన పోలి తయారీ విధానం..
ముందుగా మినపప్పును, మెంతులను ఒక గిన్నెలోకి తీసుకుని బాగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 4 నుండి 5 గంటల పాటు నానబెట్టాలి. తరువాత మరో గిన్నెలో ఇడ్లీ రవ్వను, కొర్రల రవ్వను వేసి బాగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి దీనిని కూడా 4 నుండి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత మినపప్పును జార్ లోకి తీసుకుని చల్లటి నీటిని పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత రవ్వలోని నీటిని పారబోసి దానిని ఒక కాటన్ వస్త్రంలో వేసి నీళ్లు అంతా పోయేలా చేసుకోవాలి.
ఇలా చేసుకున్న తరువాత ఈ రవ్వను పిండిలో వేసి కలుపుకోవాలి. దీనిపై మూతను ఉంచి 6 నుండి 8 గంటల పాటు లేదా రాత్రంతా పిండిని పులియబెట్టాలి. పిండి పులిసిన తరువాత దానిలో ఉప్పు వేసి కలపాలి. అవసరమైతే కొద్దిగా నీటిని పోసి కలుపుకోవాలి. ఇప్పుడు విస్తరాకులను తీసుకుని వాటిని పొట్లాలుగా చుట్టుకోవాలి. ఇవి ఊడిపోకుండా చీపురు పుల్లలు లేదా టూత్ పిక్ లను పెట్టుకోవాలి. ఈ పొట్లాలను గల్ఆస్ లో ఉంచి వాటిలో పిండిని వేసుకోవాలి. తరువాత ఇడ్లీ కుక్కర్ లో ఒక స్టాండ్ ను ఉంచి అందులో నీటిని పోయాలి. ఈ స్టాండ్ మీద చిల్లుల ప్లేట్ ను ఉంచి అందులో పిండి ఉంచిన గ్లాసులను ఉంచాలి.
వీటిపై మూతను ఉంచి 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత వీటిని బయటకు తీసి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వాసెన పోలి తయారవుతుంది. కొర్రల రవ్వనే కాకుండా రాగి రవ్వ, జొన్న రవ్వతో ఈ ఇడ్లీలను తయారు చేసుకోవచ్చు. ఎటువంటి చట్నీతో కలిపి తిన్నా కూడా ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఈ వాసెన పోలిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.