Veerabrahmendra Swamy : ఏదైనా వింత సంఘటన జరగగానే ఈ విషయం బ్రహ్మం గారు అప్పుడే చెప్పాడు అనే మాట వింటుంటాం. అసలు బ్రంహ్మం గారు ఎవరు.. ఆయనకు కాలజ్ఞానం చెప్పే శక్తి ఎలా వచ్చింది. భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించి బ్రహ్మం గారు ఏమని చెప్పారు.. వంటి తదితర ఆసక్తికరమైర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మం గారి పూర్తి పేరు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. 1608వ సంవత్సరంలో పోతులూరి పరిపూర్ణాచార్యులు, ప్రకృతాంబ దంపతులకు కాళీ పట్టణంలో జన్మించారు. అనంతరం కర్ణాటక రాష్ట్రంలోని స్కంధగిరి పర్వతసానువుల్లో ఉన్న పాపాజ్ఞి మఠం అధిపతులైన వీర భోజయాచార్య, వీర పాపమాంబల వద్ద పెరిగి అక్కడి నుండి కడప జిల్లాలోని కందిమల్లాయపల్లి చేరుకుని అచ్చమాంబ వద్ద పశువులను కాస్తూ రవ్వలకొండలో కాలజ్ఞానాన్ని రాశారు.
పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి సాక్షాత్తూ దైవ స్వరూపుడు. చిన్నతనం నుండే ఎన్నో మహిమలు చూపిన ఆయన భవిష్యత్తును తన మనోనేత్రంతో దర్శిస్తూ కాలజ్ఞానాన్ని రచించారు. బ్రహ్మం గారు చెప్పినవి చాలా వరకు జరిగాయి. మరెన్నో సంఘటనలు భవిష్యత్తులో జరగబోతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక అంబ 16 సంవత్సరాలు రాజ్య మేలుతుంది. ఇందిరా గాంధీ 16 సంవత్సరాల పాటు భారత దేశానికి ప్రధానిగా ఉన్నారు. తెర మీది బొమ్మలు గద్దెనెక్కుతారు. సినీ రంగం నుండి వచ్చిన ఎన్‌టీఆర్, ఎంజీఆర్, జయలలిత పరిపాలన సాగించిన విషయం తెలిసిందే. నీటితో దీపాలు వెలుగుతాయని బ్రహ్మం గారు 16వ శతాబ్దంలో కాలజ్ఞానంలో రాశారు. అప్పటికి నీటితో దీపాలు వెలిగిస్తారనే ఊహే ఎవరికి లేదు. కానీ ప్రస్తుతం అది జల విద్యుత్ కేంద్రాలతో నిజమైంది.
ఆకాశాన పక్షి వాహనాదులు కూలి అనేక మంది నశిస్తారు అని రాసి ఉంది. పక్షి వాహనాలు అంటే విమానాలు. ప్రతి సంవత్సరం విమానాలు కూలి అనేక మంది మరణిస్తూనే ఉన్నారు. దేవ స్థానాలు పాపాత్ముల వల్ల నాశనం అవుతాయి. దేవతా విగ్రహాలు దొంగలించబడతాయి. ఇప్పటికీ చాలా ఆలయాల్లో దేవతా విగ్రహాలు ధ్వంసం అవ్వడమో, దొంగలించబడడమో జరుగుతునే ఉన్నాయి. గట్టి వాడైనా పొట్టి వాడొకడు దేశాన్ని పాలిస్తాడు. మిగితా రాజకీయ నాయకుల కంటే కొంచెం పొట్టిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి అవినీతి, పక్షపాతానికి లొంగకుండా జనరంజకంగా దేశాన్ని పరిపాలించారు. విచిత్ర వ్యాధులు పుట్టి కూర్చున్న వారు కూర్చున్నట్టు, నిల్చున్న వారు నిల్చునట్టు అంతమైపోతారు. ఇప్పటికే అంతు చిక్కని మహమ్మారులు పుట్టి లక్షల మంది ప్రజలు మరణిస్తున్నారు.
వెంకటేశ్వరుడికి మమమ్మదీయులు కూడా పూజలు చేస్తారు. వెంకటేశ్వరుడికి మహమ్మదీయ వనిత బీబీనాంచారి భార్య కావడం చేత ముస్లింలు శ్రీనివాసున్ని అల్లుడిగా భావించి కొలుస్తుంటారు. ఒకరి భార్యను మరొకరు వశపరుచుకుంటారు. స్త్రీ, పురుషులు కామం చేత పీడితులవుతారు. సమాజంలో రోజురోజుకూ వివాహేతర సంబంధాలు ఎక్కువవుతుంటాయి. వీటి వల్ల కట్టుకున్న భర్తను, కన్న వారిని బలి దీసుకుంటున్న సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. గండక నది ఒడ్డున రాళ్లు నృత్యం చేస్తాయి. గండకి నది ఒడ్డున నేపాల్ లో భూకంపం వచ్చి ఎంత విధ్వంసం జరిగిందో మనందరికీ తెలుసు. రావణుని కాష్టాన కల్లోలం చెలరేగి దేశాన్ని అల్లకల్లోలం పెట్టేను. రావణున్ని దేశం అంటే శ్రీలంక. ఈ దేశంలో శ్రీలంక వాసులు, తమిళులు మధ్య అల్లర్లు చెలరేగి చాలా కాలం పాటు ఆరాచకం కొనసాగింది. చివరికి ఆ వైరమే భారత ప్రధాని రాజీవ్ గాంధీని బలికొంది.
కాశీ పట్టణం నలభై రోజుల పాటు పాడుబడుతుంది. 1910 – 12 మధ్యలో గంగా నదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీంతో అక్కడికి చాలా రోజుల వరకు ఎవరూ వెళ్లలేదు. తాజాగా 2020 లో వచ్చిన మహమ్మారి కారణంగా మరోసారి ఆలయం మూతబడింది. చిత్ర విచిత్ర యంత్రాలు వస్తాయి. కానీ చావు పుట్టుకలను మాత్రం కనిపెట్టలేరు. సృష్టిని మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. మానవ మేథతో సృష్టికి ప్రతిసృష్టిని చేసి మానవులను పోలిన రోబోలను తయారు చేయగలిగారు కానీ చావును మాత్రం ఇప్పటి వరకు జయించలేకపోయాం. చోళ మండలం నష్టమై పోతుంది. చోళ మండలం అంటే తమిళనాడు. తుఫాన్లు, వరదలు తమిళనాడును తాకి ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగిన సంగతి తెలిసిందే. బ్రహ్మణులు వారి ధర్మాలను, పౌరోహిత్యాన్ని వదిలి ఇతర కర్మలను చేపడతారు. దాని వల్ల అంతా అల్లకల్లోలంగా మారుతుంది.
బ్రహ్మణులు పౌరోహిత్యం వదిలి వేరే పని చేసుకుంటారంటే అప్పట్లో చాలా మంది విడ్డూరంగా చూశాసారు. కానీ అది ఇప్పుడు అక్షర సత్యం అవుతుంది. బ్రాహ్మణులు పౌరోహిత్యమే చేయాలని నియమం పెట్టుకోకుండా తమకు నచ్చిన వృత్తిలో స్థిరపడుతున్నారు. బ్రహ్మం గారు భవిష్యత్తుల్లో జరుగుతాయని చెప్పిన మరికొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం. దేశంలో పెద్ద పొగ మేఘం కమ్మకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకుని మాడిపోతారు. కంచి కామాక్షి దేవత కంటి వెంట నీరు కారుతుంది. ఈ సంఘటన జరిగిన తరువాత వందలాది మంది మరణిస్తారు. కృష్ణా, గోదావరుల మధ్య మహా దేవుడు అన్న వాడు జన్మించి అన్య మతాలను సమానంగా చూస్తూ గుళ్లు గోపురాలు నిర్మిస్తాడు. పేరు ప్రఖ్యాతులు పొందుతాడు. ఊరూరా గ్రామదేవతలు ఊగిసలాడుతారు.
ఆనంద నామ సంవత్సరాలు 13 గడిచే వరకు ఈ నిదర్శనాలు కనబడతాయి. పతివ్రతలు పతితలు అవుతారు. వావివరుసలు పాటించరు. ఆచారాలన్నీ సమసి పోతాయి. దుర్గమ్మ ముక్కు పుడుకను కృష్ణమ్మ తాకుతుంది. రాజ్యాలేలిన వారు భిక్షాటనకు దిగుతారు. భిక్షాటన చేసిన వారు ఐశ్వర్యం పొందుతారు. అడవి మృగాలు పట్టణాలు, పల్లెల్లో తిరుగుతాయి. ఏనుగు కడుపున పంది, పంది కడుపున కోతి జన్మిస్తాయి. కొండల మీద మంటలు పుడతాయి. వెంపలి చెట్టుకు నిచ్చెనలు వేసే మనుషులు పుడతారు. కృష్ణమ్మ మధ్యలో రథం కనబడుతుంది. ఆ రథాన్ని చూసిన వారి కళ్లు పోతాయి. ఆకాశ మార్గాన రెండు బంగారు హంసలు నేలకు చేరి పట్టణాల్లో తిరుగుతాయి. దురాశ పరులు వాటిని పట్టుకునేందుకు ప్రయత్నించి నశిస్తారు.
శ్రీశైలం పర్వతం పైకి ఒక మొసలి వస్తుంది. అది 8 రోజులు ఉండి భ్రమరాంభ గుడిలో చేరి మేకపోతులా అరిచి మాయమవుతుంది. తూర్పు దేశమంతా నవనాగరికతతో మెరిసి తిరిగి ధనహీనులై దరిద్రులైపోతారు. ఇత్తడి బంగారం అవుతుంది. వివాహాల్లో కులగోత్రాల పట్టింపులు వదులుతారు. ధర్మబద్దంగా వ్యాపారం చేసే వారు కనుమరుగైపోతారు. జలప్రవాహాలు ముంచెత్తడం వల్ల 14 నగరాలు మునిగిపోతాయి. నేను రావడానికి ఇదే ఒక నిదర్శనం. మీనరాశికి సూర్యుడు వచ్చే సమయంలో నేను వీర భోగ వసంతరాయులుగా ఉద్భవిస్తాను. నాలుగు మూరల ఖడ్గమును పట్టి శ్రీశైలం పర్వతం మీదికి వచ్చి అక్కడి ధనమంతా పుణ్యాత్ములైన వారికి పంచి ఇస్తాను అని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో వివరించారు.