Wheat Flour Halwa : మనకు స్వీట్ షాపుల్లో లభించే తీపి వంటకాల్లో హల్వా కూడా ఒకటి. హల్వా చాలా రుచిగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మెత్తగా, రుచిగా ఉండే ఈ హల్వాను చాలా మంది ఇష్టంగా తింటారు. మనం ఇంట్లో కూడా హల్వాను తయారు చేస్తూ ఉంటాము. అయితే హల్వాను తయారు చేయడానికి ఎక్కువగా మైదాపిండిని వాడుతూ ఉంటారు. మైదాపిండి మన ఆరోగ్యానికి మంచిది కాదు. కనుక దీనికి బదులుగా మనం గోధుమపిండితో కూడా హల్వాను తయారు చేసుకోవచ్చు. గోధుమపిండితో చేసే ఈ హల్వా కూడా చాలా రుచిగా, మెత్తగా ఉంటుంది. గోధుమపిండితో హల్వాను తయారు చేయడం కూడా చాలా సులభం. గోధుమపిండితో రుచిగా ఆరోగ్యానికి మేలు చేసేలా హల్వాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమపిండి హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
పంచదార -ఒక కప్పు, నీళ్లు – అర కప్పు, గోధుమపిండి – ఒక కప్పు , నెయ్యి – అర కప్పు, తరిగిన జీడిపప్పు – 3 టీ స్పూన్స్, యాలకుల పొడి – అర టీ స్పూన్.
గోధుమపిండి హల్వా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండిని తీసుకుని తగినన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీపిండిలా కలుపుకోవాలి. తరువాత ఇది మునిగే వరకు నీటిని పోసి 4 నుండి 5 గంటల పాటు నానబెట్టాలి. తరువాత పిండిని చేత్తో ఉండడలు లేకుండా బాగా కలుపుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని వడకట్టి పిప్పిని పడేయాలి. తరువాత ఈ గోధుమపాలను కదిలించకుండా గంట పాటు అలాగే ఉంచాలి. ఇలా చేయడం వల్ల పైన నీళ్లు, అడుగున పాలు పేరుకుపోతాయి. ఇప్పుడు నీటిని వంపేసి పాలను పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో పంచదార, నీళ్లు పోసి వేడి చేయాలి. పంచదార కరిగే లోపు మరో కళాయిలో పావు పంచదార వేసి క్యారమెల్ లాగా చేసుకోవాలి. పంచదార కరిగి క్యారమెల్ లాగా అవ్వగానే దీనిని ముందుగా వేడి చేస్తున్న పంచదార మిశ్రమంలో వేసి కలపాలి.
ఈ పంచదార మిశ్రమం మెత్తటి పాకం రావాలి. ఈ మిశ్రమాన్ని నీటిలో వేసి చూస్తే పాకం మెత్తటి ఉండలా ఉండాలి. ఇలా పాకం రాగానే ఇందులో ముందుగా సిద్దం చేసుకున్న గోధుమపాలు పోసి కలపాలి. దీనిని 5 నిమిషాల పాటు వేడి చేసిన తరువాత దగ్గర పడుతుంది. ఈ మిశ్రమం పూర్తిగా దగ్గర పడిన తరువాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కలపాలి. హల్వా నెయ్యిని మొత్తం పీల్చుకున్న తరువాత మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కలపాలి. ఇలా అర కప్పు నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుతూ ఉడికించాలి. కొద్ది సమయానికి పీల్చుకున్న నెయ్యిని హల్వా వదలడం మొదలవుతుంది. నెయ్యి పైకి తేలగానే జీడిపప్పు, యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆప్ చేసుకోవాలి. తరువాత ఈ హల్వాను గిన్నెలోకి వేసి పైన జీడిపప్పు పలుకులతో గార్నిష్ చేసుకోవాలి. హల్వా పూర్తిగా చల్లారిన తరువాత గిన్నె నుండి వేరు చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత మనకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమపిండి హల్వా తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.