ఎవరికివారు సొంతంగా స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకుంటేనే ఆర్థికంగా వృద్ధి చెందవచ్చు. ఉద్యోగాలు దొరకని వారు, ఒక సంస్థలో ఒకరి కింద పనిచేయడం ఎందుకని అనుకునేవారు స్వయం ఉపాధితో డబ్బులు సంపాదించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. వాటిల్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే ఉపాధి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి మైక్రోగ్రీన్స్ పెంపకం. దీంతో నెలకు రూ.80వేల వరకు సంపాదించుకోవచ్చు.
మీ ఇంట్లో ఖాళీగా ఉన్న చిన్న గది ఉన్నా లేదా ఇంటి చుట్టు చిన్నపాటి స్థలం ఉన్నా సరే మైక్రోగ్రీన్స్ ను పెంచవచ్చు. మైక్రోగ్రీన్స్ అంటే ఏమీ లేదు.. మనం నిత్యం విత్తనాలు, గింజలు, కూరగాయలు, ఆకుకూరలకు చెందిన మొలకలు అన్నమాట. వాటి విత్తనాలను మట్టిలో నాటితే కొద్ది రోజుల్లో అవి మొలకలుగా మారి చిన్న మొక్కలుగా పెరుగుతాయి. ఆ సమయంలో వాటిని సేకరించాలి. వాటిని ప్యాకెట్లలో నిల్వ చేసి సూపర్ మార్కెట్లు, పండ్లు, కూరగాయలు అమ్మేవారికి విక్రయించవచ్చు. దీంతో పెద్ద ఎత్తున లాభాలు వస్తాయి.
మైక్రోగ్రీన్స్ పెంచేందుకు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. చిన్నపాటి ట్రేలు, పూల కుండీలు, వాడి పడేసిన పాల ప్యాకెట్లు, ఇతర వస్తువుల్లో మట్టి, వర్మి కంపోస్టు నింపి అందులో విత్తనాలను వేసి కొద్ది కొద్దిగా నీరు పోస్తుండాలి. దీంతో మొలకలు వచ్చి మొక్కలు పెరుగుతాయి. అవి చిన్నగా ఉండగానే సేకరించాలి. తరువాత అదే మట్టిలో సేంద్రీయ ఎరువులు వేసి మళ్లీ మైక్రోగ్రీన్స్ ను పెంచవచ్చు.
ఇక మైక్రోగ్రీన్స్ను పెంచేందుకు అవసరం అయ్యే ట్రేలు, కుండీలను పెట్టుకునేందుకు స్థలం ఉంటే చాలు. వాటిని సులభంగా పెంచవచ్చు. మార్కెట్లో పొద్దు తిరుగుడు, గుమ్మడికాయ విత్తనాలు, ముల్లంగి, బీట్రూట్, ఆవాలు, మెంతులు, క్యాబేజీ వంటి భిన్న రకాల విత్తనాలు లభిస్తాయి. వాటిని మైక్రోగ్రీన్స్ లా పెంచవచ్చు.
మైక్రోగ్రీన్స్ను సేకరించిన తరువాత ఆ మొక్కలకు ఉండే ఆకులను తెంపి వాటిని ఆహార పదార్థాలపై చల్లుకుని అలాగే తినేస్తారు. అందువల్ల వాటిని వీలైనంత తాజాగా అందించే ప్రయత్నం చేయాలి. 10 x 10 సైజ్ ఉన్న గదిలో మైక్రో గ్రీన్స్ను పెంచితే నెలకు ఏకంగా రూ.80వేల వరకు ఆదాయం వస్తుంది.
మైక్రోగ్రీన్స్ను ఇలా పెంచాలి
1. విత్తనాలను ముందుగా 3 రోజుల పాటు నీటిలో నానబెట్టాలి.
2. తరువాత అవి మొలకెత్తుతాయి. వాటిని మట్టితో నింపిన ట్రేలో నాటాలి. సూర్యకాంతి నేరుగా పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నీడలో ట్రేలను ఉంచాలి.
3. మట్టిపై నీటిని నేరుగా పోయకుండా స్ప్రే బాటిల్లో స్ప్రే చేస్తుండాలి.
4. తరువాత 7 నుంచి 14 రోజుల్లోగా విత్తనం రకాన్ని బట్టి మైక్రోగ్రీన్స్ పెరుగుతాయి. వాటిని సేకరించి ప్యాకెట్లలో స్టోర్ చేసి నేరుగా సప్లై చేయవచ్చు.
మైక్రోగ్రీన్స్ పెంపకం ద్వారా ఇలా లాభాలను ఆర్జించవచ్చు.