మన శరీరానికి అవసరం అయ్యే సూక్ష్మ పోషకాల్లో జింక్ ఒకటి. ఇది శరీరంలో అనేక క్రియలను నిర్వహిస్తుంది. అనేక రకాల వృక్ష సంబంధ ఆహారాలతోపాటు జంతు సంబంధ పదార్థాల్లోనూ జింక్ మనకు లభిస్తుంది. మన శరీర రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే అందుకు జింక్ ఎంతగానో అవసరం అవుతుంది. అలాగే చర్మం ఆరోగ్యంగా ఉండాలన్నా, గాయాలు త్వరగా మానాలన్నా, వాపులు తగ్గాలన్నా అందుకు జింక్ ఉపయోగపడుతుంది. కోడిగుడ్లు, మాంసం వంటి పదార్థాల్లో మనకు జింక్ లభిస్తుంది. అలాగే పలు వెజిటేరియన్ ఆహారాల్లోనూ మనకు ఇది లభిస్తుంది.
తృణ ధాన్యాలు
తృణ ధాన్యాలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. వీటిల్లో ఫైబర్ (పీచు పదార్థం), ఇతర అవసరమైన పోషకాలు ఉంటాయి. గోధుమలు, ముడి బియ్యం (బ్రౌన్ రైస్), క్వినోవా, ఓట్స్ వంటి ఆహారాల్లో మనకు జింక్ లభిస్తుంది. వీటిని నిత్యం తీసుకోవడం వల్ల మనకు జింక్ అందుతుంది.
పాలు, పాల ఉత్పత్తులు
పాలు, పాల ఉత్పత్తుల్లో కేవలం కాల్షియం మాత్రమే కాదు, జింక్ కూడా ఉంటుంది. చీజ్ నుంచి పాల వరకు ఈ ఉత్పత్తులను నిత్యం మనం అనేక రకాలుగా తీసుకోవచ్చు. వీటి వల్ల ప్రోటీన్లు, విటమిన్ డి, ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా మనకు అందుతాయి.
నట్స్
నట్స్‌ను పోషకాలకు గనులుగా చెప్పవచ్చు. రోజూ గుప్పెడు నట్స్‌ను స్నాక్స్ రూపంలో తినవచ్చు. పల్లీలు, పైన్ నట్స్, జీడిపప్పు, బాదంపప్పులలో జింక్ సమృద్ధిగా ఉంటుంది. వీటిని నేరుగా తినవచ్చు. లేదా ఓట్స్, పెరుగు వంటి వాటిలో కలుపుకుని తినవచ్చు.
విత్తనాలు
నట్స్ లాగే విత్తనాలు (సీడ్స్)లనూ అనేక పోషకాలు ఉంటాయి. గుమ్మడికాయ విత్తనాలు, నువ్వులు తదితర విత్తనాల్లో జింక్ ఎక్కువగా ఉంటుంది.
కూరగాయలు
నిత్యం మనం తినే అనేక రకాల కూరగాయల్లోనూ జింక్ ఉంటుంది. ఉదాహరణకు బంగాళా దుంపలు, బీన్స్, బ్రొకొలి, పుట్ట గొడుగులు, వెల్లుల్లి వంటి పదార్థాల్లో జింక్ లభిస్తుంది.
జింక్ లోపం ఉంటే కనిపించే లక్షణాలు
- అకస్మాత్తుగా బరువు తగ్గుతారు.
- గాయలు త్వరగా మానవు.
- అప్రమత్తంగా ఉండడం తగ్గిపోతుంది.
- రుచి, వాసన చూసే శక్తిని కోల్పోతారు.
- విరేచనాలు అవుతాయి. ఆకలి ఉండదు.
- చర్మంపై ఉండే రంధ్రాలు తెరుచుకుంటాయి.
జింక్ ఎవరెవరికి ఎంత అవసరం
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చెబుతున్న ప్రకారం.. ఒక స్త్రీకి నిత్యం 8 మిల్లీగ్రాముల వరకు జింక్ అవసరం అవుతుంది. అదే పురుషుడికి అయితే 11 మిల్లీగ్రాముల వరకు జింక్ కావాలి. గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు రోజుకు 12 మిల్లీగ్రాముల వరకు జింక్ అవసరం.
జింక్ లోపిస్తే డాక్టర్ సూచన మేరకు నిత్యం మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లను కూడా వాడుకోవచ్చు. దీంతోపాటు పైన తెలిపిన ఆహారాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో జింక్ లోపం రాకుండా ఉంటుంది.