తాజా పండ్లను తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే శక్తి లభిస్తుంది. అయితే ఈ రెండింటినీ అందించే పండ్లలో జామ పండ్లు కూడా ఒకటి. వీటిని అత్యంత ఆరోగ్యవంతమైన ఆహారంగా చెప్పవచ్చు. జామ పండ్లను రోజూ నేరుగా తినవచ్చు. లేదా జ్యూస్ చేసుకుని చక్కెర లేకుండా తాగవచ్చు. ఈ పండ్లలో విటమిన్లు సి, ఎ, ఇ, ఫైబర్, మినరల్స్, ఫైటో కెమికల్స్ అధికంగా ఉంటాయి. ఇవి డయేరియా, డయాబెటిస్, స్థూలకాయం వంటి సమస్యలను తగ్గిస్తాయి. గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.
1. జామ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. నారింజ పండ్ల కన్నా జామ పండ్లలోనే విటమిన్ సి అధికంగా లభిస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో చేరే సూక్ష్మ క్రిములను చంపుతుంది. ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తుంది.
2. అధిక బరువు ఉన్నవారికి జామ పండ్లు ఎంతగానో మేలు చేస్తాయి. దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఆకలి నియంత్రణలో ఉంటుంది. జంక్ ఫుడ్ తినకుండా జాగ్రత్త పడవచ్చు. ఇతర అనేక పండ్లతో పోలిస్తే వీటి ద్వారా అందే గ్లూకోజ్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల ఇవి అందరికీ ఆరోగ్యాన్ని అందిస్తాయి.
3. జీర్ణ సమస్యలు ఉన్నవారు జామ పండ్లను తింటే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. జామ పండ్లను తినడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది. అందులో ఉండే విష, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. మలబద్దకం, విరేచనాలు తగ్గుతాయి. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. చిన్నపేగుల గోడలు దృఢంగా మారుతాయి.
4. జామ పండ్లలో పొటాషియం, సాల్యుబుల్ ఫైబర్, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఈ పండ్లను తరచూ తింటే హైబీపీ తగ్గుతుంది. ఈ పండ్లలో ఉండే పొటాషియం బీపీని నియంత్రిస్తుంది. ఈ పండ్లలోని విటమిన్ సి రక్త నాళాలు, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో గుండె జబ్బులు రావు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
5. జామ పండ్లలో క్వర్సెటిన్, లైకోపీన్, విటమిన్ సి లు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి. జామ పండ్లలో ఉండే సమ్మేళనాలు ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీంతో క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. తరచూ జామ పండ్లను తినడం వల్ల ప్రోస్టేట్, స్కిన్, బ్రెస్ట్, స్టమక్, లంగ్, కొలన్ క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు.
6. కళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్ ఎ ఎంతగానో ఉపయోగపడుతుంది. జామ పండ్లలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. కంటి చూపును మెరుగు పరుస్తుంది. కళ్లలో శుక్లాలు ఏర్పడవు. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.