Custard Apple : కాలానుగుణంగా లభించే పండ్లల్లో సీతాఫలం ఒకటి. ఈ పండ్ల రుచి వీటిని ఎప్పుడెప్పుడూ తిందామా అని ఎదురు చూసేలా చేస్తాయి. ఈ పండ్ల స్వస్థలం మన దేశం కాదు. దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికన్ దేశాల్లో పెరిగే ఈ మొక్కలను మన దేశానికి మొదటిసారిగా పోర్చుగీస్ వారు 16వ శతాబ్దంలో తీసుకువచ్చారట. ఈ సీతాఫలాలను కస్టర్డ్ ఆపిల్, స్వీట్ ఆపిల్ అని కూడా పిలుస్తారు. ఈ పండ్లు దక్షిణ అమెరికా దేశాలతోపాటు మన దేశంలోనూ విరివిరిగా పండుతాయి. పండుగా తినడంతోపాటు స్వీట్స్, జెల్లీలు, ఐస్ క్రీమ్ లు, జామ్ లూ చేస్తూ ఉంటారు.
చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినే ఈ సీతాఫలాల్లో మానవ శరీరానికి అవసరమయ్యే ఔషధ గుణాలు చాలా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ సీతాఫలంలో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణశక్తిని పెంచడంలో అద్భుతంగా పని చేస్తుందని వారు అంటున్నారు. మన శరీరంలో వ్యాధి నిరోధకతను పెంచే గుణాలు సీతాఫలంలో పుష్కలంగా ఉన్నాయి. దీనిలో అధికంగా ఉండే విటమిన్ సి మన శరీరంలో రోగ నిరోధకతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది అలర్జీలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. శరీరంలో ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది. దీనితో మనం వ్యాధుల బారిన పడకుండా ఉంటాం.
సీతాఫలంలో విటమిన్ సితోపాటు క్యాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నినీషియం వంటి మినరల్స్ కూడా సమృద్ధిగా ఉన్నాయి. నోటిలో జీర్ణ రసాలను ఉత్పత్తి చేసే శక్తి ఈ పండుకు అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే మెగ్నీషియం శరీరంలో కండరాలకు విశ్రాంతిని ఇస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. క్యాల్షియం ఎముకల పటుత్వాన్ని పెంచుతుంది. పీచు పదార్థాలు మలబద్దకంతో బాధపడే వారికి మంచి మందు. మలబద్దకం సమస్యతో బాధపడే వారు రోజూ ఈ పండ్లను తినగలిగితే ఎంతో మార్పు కనిపిస్తుంది.
సీతాఫలంలో చక్కెరలు ఎక్కువ శాతంలో ఉంటాయి. కనుక ఇన్ని లాభాలు ఉన్నప్పటికీ మధుమేహ వ్యాధి గ్రస్తులు వీటికి దూరంగా ఉండడమే మేలు. ఉబ్బసం వ్యాధి గ్రస్తులు కూడా వైద్యుల సలహా తీసుకుని తినాలి. సీతాఫలాలను ఖాళీ కడుపుతో తినకూడదు. తిన్నాక మంచి నీళ్లు ఎక్కువగా తాగాలి. ఎదిగే పిల్లలకు రోజూ ఒకటి రెండు పండ్లు తినిపిస్తే మంచిది. ఈ పండు ఆరోగ్యాన్ని కాపాడడంతోపాటు ఎముకల పరిపుష్టికి తోడ్పడతాయి. హృద్రోగులు, నరాల బలహీనత ఉన్నవారు సీతాఫలాన్ని అల్పాహారంగా తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. ఆహార నియమాలు పాటించే వారు సైతం ఈ ఫలాన్ని నిరభ్యంతరంగా తినవచ్చు.
సీతాఫలంలో ఉండే సల్ఫర్ చర్మ వ్యాధులను తగ్గిస్తుంది. ఈ పండును తినడం వల్ల శరీరంలోని క్రిములు, వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి. ఒక్క సీతాఫలం పండే కాదు ఈ చెట్టు ఆకుల వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆకుల్లోని హైడ్రోస్థెనిక్ ఆమ్లం చర్మ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. ఈ చెట్టు ఆకులకు పసుపును కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని మానని గాయాలపై, గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులపై పూతగా రాస్తే అవి తగ్గిపోతాయి. సీతాఫలం చెట్టు ఆకులను మెత్తగా నూరి బోరిక్ పౌడర్ కలిపి మంచం, కుర్చీల మూలల్లో ఉంచితే నల్లుల బెడద అస్సలు ఉండదు.
సీతాఫలం చెట్టు బెరడును కాచగా వచ్చిన కషాయాన్ని అధిక విరేచనాలతో బాధపడే వారికి ఔషధంగా ఇవ్వడం వల్ల విరేచనాలు వెంటనే తగ్గుతాయి. సీతాఫలం పండు గింజలను పొడిగా చేసి తలకు రాసుకుంటే పేలస మస్య తొలిగిపోతుంది. సీతాఫలాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇవి మనకు అన్ని కాలాల్లోనూ లభించవు. కనుక సీతాఫలాలు లభించినప్పుడు వీటిని ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయాలని నిపుణులు చెబుతున్నారు.