Almonds : మనలో చాలా మందికి ప్రతీ రోజూ ఏదో ఒక రకమైన చిరుతుళ్లు ఆహారంగా ఉండాల్సిందే. అవి లేనిదే కొందరికి రోజూ వారీ డైట్ కూడా పూర్తవదు. అయితే ఈ చిరుతిళ్లను కూడా సరైన వాటిని ఎంచుకొని సరైన సమయం లో తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక డ్రై ఫ్రూట్స్, నట్స్ లాంటివి స్నాక్స్ రూపంలో తీసుకోవడం ఆరోగ్యకరమైన అలవాటుగా పరిగణిస్తారు. వీటిలో ముఖ్యమైనది బాదంపప్పుగా మనం చెప్పుకోవచ్చు. దీంతో లెక్కలేనన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.
అయితే ఈ బాదం ని ప్రతీరోజూ తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో, ఏ సమయంలో తినడం సరైనదో.. ఇప్పుడు మనం తెలుసుకుందాం. బాదం గింజలలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ మనల్ని యాక్టివ్ గా ఉంచుతుంది. వీటిని విటమిన్ బి6 లభించే అరటి పళ్లు ఇంకా ఓట్స్ తో కలిపి తీసుకున్నపుడు బాదంలో ఉండే ట్రిప్టోఫాన్ మన శరీరంలో సెరొటోనిన్ గా మారుతుంది. ఈ సెరొటోనిన్ మనలో ఎనర్జీ బూస్టర్ లా పనిచేస్తుంది. ఇంకా మనలో ఉత్సాహాన్ని పెంచడంతోపాటు వ్యాకులతని కూడా తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. దీని కోసం ఉదయాన్నే ఓట్ మీల్ తోపాటు అరటి పళ్లు ఇంకా బాదంని కలిపి తీసుకోవాలి.

బాదంలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. 20 బాదం గింజలను తినడం వల్ల మనం రోజూ వారీగా తీసుకోవాల్సిన మోతాదులో 48 శాతం విటమిన్ ఇ ని పొందవచ్చు. ఇక విటమిన్ ఇ మనకు అల్జీమర్స్ వ్యాధి, వివిధ రకాల కాన్సర్లు ఇంకా హృదయ నాళ సంబంధ జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో తోడ్పడుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం బాదంలో ఉండే కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్ కె, ప్రొటీన్, జింక్ ఇంకా కాపర్ లు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలకంగా వ్యవహరిస్తాయని తేలింది.
ఇంకా మన శరీరం లోని చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచడంలో బాదం గింజలు చక్కగా పని చేస్తాయి. అంతే కాకుండా టైప్ 2 డయాబెటీస్ తో బాధ పడేవారు రోజూ కొన్ని బాదం పప్పులను తినడం వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. ఇంకా రోజూ బాదం గింజలను తీసుకోవడం వల్ల అవి ఆకలిని తగ్గిస్తాయి, దాని వలన బరువు తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే బాదంను ఉదయం పూట తీసుకోవడం వల్లనే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. వీటిని ఉదయం అల్పాహారంలో భాగం చేసుకొని తినడం వలన జీవక్రియ మెరుగుపడడంతోపాటు రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండి రోజంతా ఉత్సాహంగా ఉంటారు.