మన తలపై ఊడిపోయిన వెంట్రుకలను తిరిగి వచ్చేలా చేసే శక్తి ఉన్న మొక్క మన ఇంటి పరిసరాలల్లోనే ఉందన్న విషయం మనలో చాలా మందికి తెలియదు. తలపై వెంట్రుకలను మొలిపించేంత శక్తి ఉన్న మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముళ్ల వంగ మొక్కను మనలో చాలా మంది చూసే ఉంటారు. దీనిని నేల వాకుడు, నేల ములక, కంటకారి ఇలా ప్రాంతాల వారిగా పిలుస్తూ ఉంటారు. నిలువెల్లా ముళ్లతో ఉండే ఈ మొక్క ఆకులు, పువ్వులు, కాయలు, వేర్లు.. ఇలా అన్నీ కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి.
ఈ మొక్క ను ఆయుర్వేదంలో విరివిరిగా ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ మొక్క కాయలను కూరగా కూడా వండుకుని తింటారు. బట్టతల, పేనుకొరుకుడు వంటి వాటి వల్ల ఊడిపోయిన జుట్టు తిరిగి వచ్చేలా చేసే శక్తి ముళ్ల వంగ మొక్కకు ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. బాగా పండిన ముళ్ల వంగ కాయలను సేకరించి వాటి నుండి రసాన్ని తీయాలి. ఈ రసంలో తేనెను కలిపి జుట్టు ఐడిపోయిన ప్రదేశంలో కొన్ని రోజుల పాటు మర్దనా చేస్తూ ఉండడం వల్ల ఆ ప్రదేశంలో వెంట్రుకలు తిరిగి వస్తాయి.
అలాగే పక్వానికి వచ్చిన ఈ చెట్టు కాయలను తీసుకుని సగానికి కోసి గింజలను తీసేయాలి. తరువాత మిగిలిన గుజ్జు నుండి రసాన్ని తీసి ఆ రసానికి సమానంగా మందార పువ్వుల రసాన్ని తీసి జుట్టు ఊడిన చోట మర్దనా చేయడం వల్ల కూడా చక్కని ఫలితం ఉంటుంది. జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలను నయం చేయడంలో కూడా ముళ్ల వంగ మొక్క మనకు ఉపయోగపడుతుంది. ఈ మొక్క ఆకుల నుండి ముళ్లను వేరు చేసి ఆ ఆకుల నుండి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని తలకు రాసి అర గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉండడం వల్ల జుట్టు రాలడంతోపాటు చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.
జుట్టు సంబంధిత సమస్యలే కాకుండా మనకు వచ్చే ఇతర అనారోగ్య సమస్యలను నయం చేయడంలో కూడా ముళ్ల వంగ మొక్క మనకు ఎంతగానో సహాయపడుతుంది. కీళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి వాటితో బాధపడుతున్నప్పుడు ముళ్ల వంగ మొక్క ఆకులను మెత్తగా నూరి దానిలో కొద్దిగా వేడి చేసిన వెన్నను కలిపి నొప్పి ఉన్న చోట ఉంచి కట్టుకట్టాలి. ఇలా తరచూ చేస్తూ ఉండడం వల్ల నొప్పులు తగ్గుతాయి. ఈ మొక్క కాయల నుండి తీసిన రసంతో మాడుపై మర్దనా చేయడం వల్ల తలనొప్పి వెంటనే తగ్గుతుంది.
పిప్పి పన్నుతో బాధపడుతున్నప్పుడు పండిన ముళ్ల వంగ కాయలను సేకరించి వాటిని కాల్చగా వచ్చిన పొగను నోటితో పీల్చడం వల్ల పిప్పిపన్ను వల్ల కలిగే నొప్పి తగ్గుతుంది. అంతేకాకుండా ఈ మొక్క ఆకుల రసంలో దూదిని ముంచి ఆ దూదిని పిప్పి పన్నుపై ఉంచడం వల్ల కూడా చక్కని ఫలితం ఉంటుంది. ముళ్ల వంగ మొక్క వేరుకు విషాన్ని హరించే శక్తి కూడా ఉంటుంది. ఈ మొక్క వేరును నీటితో కలిపి ఆరగదీసి ఆ మిశ్రమానికి నిమ్మరసాన్ని కలిపి పాము, తేలు వంటి విష కీటకాలు కుట్టిన చోట రాయడం వల్ల విష ప్రభావం తగ్గుతుంది.
ముళ్ల వంగ మొక్కను సమూలంగా సేకరించి నీటిలో వేసి మరిగించాలి. ఇలా మరిగించిన నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల దంత సమస్యలు తొలగిపోతాయి. మూత్ర పిండాల్లో రాళ్లను కరిగించే శక్తి కూడా నేల వంగ మొక్కకు ఉంటుంది. ఈ మొక్క వేరును ఎండబెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. రోజూ ఉదయం పరగడుపున ఈ పొడిని రెండు టీ స్పూన్ల మోతాదులో తీసుకుని దానిని ఒక గ్లాస్ పెరుగులో కలుపుకుని ప్రతిరోజూ తాగాలి. ఇలా చేయడం వల్ల మూత్ర పిండాల్లో రాళ్లు కరిగి మూత్రం ద్వారా బయటకు పోతాయి.
ఈ విధంగా ముళ్ల వంగ మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని, దీనిని వాడడం వల్ల జుట్టు సంబంధిత సమస్యలతోపాటు ఇతర అనారోగ్య సమస్యలను కూడా నయం చేసుకోవచ్చని.. ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.