How To Take Moringa Leaves Powder : ప్రకృతి మనకు అందించిన అద్భుతమైన ఔషధాల్లో మునగాకులు కూడా ఒకటి. మునగాకులను చాలా మంది తినరు. కానీ వీటిని పొడిగా చేసి మాత్రం ఉపయోగించవచ్చు. మునగాకుల పొడిని తీసుకోవడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. కేవలం మునగాకులు మాత్రమే ఏకంగా 300 రకాలకు పైగా వ్యాధులను తగ్గించగలవని ఆయుర్వేద వైద్యులు సైతం చెబుతుంటారు. మునగాకుల పొడిని తీసుకున్నా కూడా మనం అలాంటి ప్రయోజనాలనే పొందవచ్చు. మునగాకుల పొడిలో మన శరీరానికి అవసరం అయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి.
100 గ్రాముల మునగాకుల్లో 78.7 గ్రాముల నీరు ఉంటుంది. 9.4 గ్రాముల ప్రోటీన్లు, 2 గ్రాముల ఫైబర్, 51.7 మిల్లీగ్రాముల విటమిన్ సి, 1.2 మిల్లీగ్రాముల విటమిన్ బి6, 4 మిల్లీగ్రాముల ఐరన్, 0.6 మిల్లీగ్రాముల జింక్ ఉంటాయని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ చెబుతోంది. అందువల్ల మునగాకుల పొడిని తింటే మనం ఈ పోషకాలు అన్నింటినీ పొందవచ్చు. మునగాకుల పొడిని తినడం వల్ల శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి. కాంతివంతంగా మారుతాయి. జుట్టు రాలడం తగ్గుతుంది.
అనేక విధాలుగా ప్రయోజనాలు..
మునగాకుల పొడిని తీసుకుంటే చర్మం కూడా కాంతివంతంగా మారి యవ్వనంగా కనిపిస్తారు. ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు, వృద్ధాప్య ఛాయలు పోతాయి. అలాగే ఈ పొడి వల్ల అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చు. అయితే ఈ ప్రయోజనాలను పొందాలంటే మునగాకుల పొడిని ఎలా తీసుకోవాలి.. అని చాలా మంది సందేహిస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ పొడిని ఎలా తీసుకుంటే మనకు ఏ విధమైన ప్రయోజనం కలుగుతుంది.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అందం కోసం..
మునగాకుల పొడి 1 టీస్పూన్, 1 టీస్పూన్ తేనెను తీసుకుని మెత్తని పేస్ట్‌లా చేయాలి. ఇందులో నిమ్మరసం కూడా కలపాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాలు ఆగి గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇది చక్కని ఫేస్ మాస్క్‌లా పనిచేస్తుంది. దీంతో చర్మం కాంతివంతంగా మారి మృదువుగా తయారవుతుంది. ముఖ సౌందర్యం పెరుగుతుంది. అలాగే మునగాకుల పొడిని కలబంద గుజ్జుతో కలిపి వాడడం వల్ల చర్మంపై వచ్చే ఎరుపు దనం, వాపులు పోతాయి. అదేవిధంగా మునగాకుల పొడి, కొబ్బరినూనె, తేనెలను కలిపి హెయిర్ ప్యాక్‌గా కూడా వాడవచ్చు.
శిరోజాల కోసం, బరువు తగ్గేందుకు..
ఈ హెయిర్ ప్యాక్‌ను జుట్టు అప్లై చేశాక కనీసం 30 నిమిషాల పాటు ఉండి తరువాత తలస్నానం చేయాలి. ఈవిధంగా చేస్తుంటే జుట్టు రాలడం తగ్గి శిరోజాలు ఒత్తుగా, పొడవుగా పెరుగుతాయి. దృఢంగా మారుతాయి. అయితే పొడి జుట్టు ఉన్నవారికి ఇది బాగా పనిచేస్తుంది. ఇక మునగాకుల పొడిని శిరోజాలు లేదా చర్మానికి వాడాల్సి వస్తే వారంలో 1 లేదా 2 సార్లు వాడితే చాలు. అదే బరువు తగ్గాలనుకునే వారు మాత్రం రోజూ దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని నీటిలో వేసి మరిగించి తాగవచ్చు. లేదా వేడి నీటిలో కలిపి కాసేపు ఉంచి తరువాత తాగవచ్చు. అలాగే మీరు తినే బ్రేక్‌ఫాస్ట్ లేదా సలాడ్స్, ఆహారంపై కూడా మునగాకుల పొడిని చల్లిని తీసుకోవచ్చు.
ఎంత మోతాదులో తినాలి..?
ఇలా ఏ రకంగా మునగాకుల పొడిని తిన్నా కూడా అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా శరీరంలోని కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. అయితే మునగాకుల పొడిని ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ముందుగా పావు టీస్పూన్‌తో మొదలు పెట్టండి. మీకు ఈ పొడి పడుతుంది అనుకుంటే నెమ్మదిగా డోసు పెంచవచ్చు. తరువాత అర టీస్పూన్, అనంతరం 1 టీస్పూన్ వరకు ఈ పొడిని తీసుకోవచ్చు. అయితే రోజూ 1 టీస్పూన్ కన్నా ఎక్కువ మోతాదులో మాత్రం ఈ పొడిని తీసుకోకూడదు. లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.
మునగాకుల పొడిని అతిగా తీసుకుంటే అనేక సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ పొడిలో ఉండే అధిక ఫైబర్ జీర్ణాశయంలో గ్యాస్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. అలాగే కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తుంది. ఈ పొడిని అతిగా తింటే విరేచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. వికారం కూడా కలగవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు అతిగా తింటే షుగర్ లెవల్స్ మరీ తక్కువకు పడిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక డయాబెటిస్ లేదా థైరాయిడ్ ఉన్నవారు, కిడ్నీ, లివర్ సమస్యలు ఉన్నవారు మాత్రం డాక్టర్ సలహా మేరకు మునగాకుల పొడిని తింటే మేలు జరుగుతుంది. ఇలా ఈ పొడిని తీసుకోవడం వల్ల మనం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.