పాలను సంపూర్ణ పోషకాహారం అని పిలుస్తారు. భారతీయుల ఆహారంలో పాలు ఎంతో ముఖ్య భాగంగా ఉన్నాయి. పాలను కొందరు నేరుగా తాగుతారు. కొందరు అందులో తేనె, పసుపు, మిరియాల పొడి, దాల్చిన చెక్క పొడి వంటివి కలుపుకుని తాగుతారు. పాలలో ప్రోటీన్లు, విటమిన్ ఎ, బి1, బి2, బి12, డి, పొటాషియం, మెగ్నిషియం వంటి పోషకాలు ఉంటాయి. నిత్యం మనం తాగవల్సిన పలు ముఖ్యమైన పానీయాల్లో పాలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి.
శాకాహారులకు ప్రోటీన్లు కావాలంటే నిత్యం పాలు తాగాల్సి ఉంటుంది. పాలలో ప్రోటీన్లతోపాటు కొవ్వులు, పిండి పదార్థాలు కూడా ఉంటాయి. మన శరీరానికి కావల్సిన విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. ఆయుర్వేదంలో పాలకు ప్రముఖ స్థానం కల్పించారు. ఇందులో పోషక విలువలు మాత్రమే కాదు, జీర్ణవ్యవస్థను బాగు చేసే గుణాలు కూడా ఉంటాయి.
పాల వల్ల మనకు ఆరోగ్యకర ప్రయోజనాలు కలిగే మాట వాస్తవమే. కానీ పాలను ఎప్పుడు, ఎలా తాగాలో తెలుసుకోవాలి. దీంతోనే మనకు పాల వల్ల ప్రయోజనాలు కలుగుతాయి. పాలను మిల్క్ షేక్‌ల రూపంలో అస్సలు తాగవద్దని ఆయుర్వేదం చెబుతోంది. ముఖ్యంగా పుల్లని పండ్లు, అరటి పండ్లు, మామిడి, పుచ్చకాయలు, తర్బూజా వంటి పండ్లతో పాలను అస్సలు కలపకూడదని ఆయుర్వేదం చెబుతోంది.
కొందరు పాలు, అరటి పండ్లను కలిపి బనానా మిల్క్ షేక్స్ వంటివి చేసుకుని తాగుతారు. కానీ అలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థలో అగ్ని (గ్యాస్ట్రిక్ ఫైర్) నాశనం అవుతుంది. ఫలితంగా పేగుల్లో మార్పులు వస్తాయి. శరీరంలో విష పదార్థాలు పెరిగిపోతాయి. సైనస్, దగ్గు, జలుబు, అలర్జీలు, దద్దుర్లు వస్తాయి. కనుక పాలను, అరటి పండ్లను అస్సలు మిక్స్ చేయకూడదు.
ఆయుర్వేద ప్రకారం పాలను రాత్రిపూట తాగితేనే ఎక్కువ ఫలితాలు ఉంటాయి. రాత్రి పూట పాలలో తేనె, అశ్వగంధ, త్రిఫల చూర్ణం వంటివి కలుపుకుని తాగడం వల్ల నిద్ర లేమి సమస్య నుంచి బయట పడవచ్చు. నిద్ర బాగా వస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కంటి చూపు పెరుగుతుంది. కంటి సమస్యలు పోతాయి.
సాధారణంగా ఉదయం పూట మన శరీర మెటబాలిజం తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు పాల వంటి భారమైన పదార్థాలను తీసుకుంటే జీర్ణవ్యవస్థకు ఇబ్బందులు వస్తాయి. త్వరగా జీర్ణం కావు. గ్యాస్, అసిడిటీ వంటివి వస్తాయి. అదే రాత్రి పూట మెటబాలిజం ఎక్కువగా ఉంటుంది. కనుక పాలను రాత్రి పూట తాగితే మంచిది. పైగా పాలలో ఉండే కాల్షియం, విటమిన్ డిలు మనకు రాత్రి పూట ఎంతగానో అవసరం అవుతాయి. ఇవి ఎముకల నిర్మాణానికి, అధిక బరువును తగ్గించేందుకు సహాయ పడతాయి. కనుక పాలను రాత్రి పూట తాగితే మంచిది.
ఇక పాలను, ఉప్పు కలిగిన పదార్థాలను కలిపి తీసుకోవడం కూడా శరీరానికి మంచిది కాదు. జీర్ణాశయం ఇబ్బందులు పడుతుంది. పాలను తాగాలనుకునే వారు సాయంత్రం నుంచి రాత్రి వరకు ఎప్పుడైనా తాగవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. పాలను రాత్రి పూట తాగడం వల్ల శరీరంలో సెరొటోనిన్ పెరుగుతుంది. దీంతో నిద్ర బాగా వస్తుంది. నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు.