మానవ చర్మ కణాలను పుట్టించే యాంటీ ఏజింగ్ క్రీమ్ ను సైంటిస్టులు కనిపెడుతున్నట్లు వెల్లడించారు.లండన్ లోని ప్రపంచ ప్రసిధ్ధ, లా ఓరియల్ కాస్మెటిక్ కంపెనీలోని రీసెర్చర్లు చర్మంపై ముడుతలు, చర్మం ఎక్కడైనా చెడితే దానికొరకు ఒక క్రీమును కనిపెట్టారు. అది ఈ సంవత్సరంలో మార్కెట్ లోకి కూడా ప్రవేశపెట్టనున్నట్లు లండన్ లోని ది డైలీ మెయిల్ వార్తా పత్రిక వెల్లడించింది. ఈ క్రీము చర్మానికి రాస్తే, వున్న వయసు కంటే కూడా తక్కువగా కనపడేట్లు చేస్తుందని రీసెర్చర్ల విశ్వసనీయ సమాచారంగా వెల్లడైంది.
ప్రయోగాత్మకంగా అది రాసుకున్న వారి చర్మపు ఎలాస్టిసిటీ, దళసరితనం, మృదుత్వం వంటివి గణనీయంగా మార్పు చెందినట్లు లాఓరియల్ కంపెనీ రీసెర్చి డైరెక్టర్ బ్రూనో బెర్నార్డ్ తెలిపినట్లు ది డెయిలీ మెయిల్ వెల్లడించింది. ఇప్పటివరకు వచ్చిన క్రీములన్నీ చర్మ పై భాగంలో పనిచేసేవేనని, ఈ ప్రత్యేక క్రీము చర్మంలోని కణాల పొరల అట్టడుగునుండి పని చేసి మనిషి చర్మాన్ని మరింత సుందరం చేస్తుందని వీరు తెలుపుతున్నారు.
ఈ క్రీము తయారీలో సహజమైన షుగర్స్ వినియోగం వుందట. చేసిన రీసెర్చి ఖచ్చితమైన చర్మ నాణ్యతలను తమ లేబరేటరీ ప్రయోగాలలోను మానవులపై చేసిన ప్రయోగాలలోను బాగా పెంచిందని రీసెర్చర్లు తెలిపారు. తాము కనిపెట్టిన ఈ క్రీము ఆరోగ్య రీత్యా కూడా అద్భుతమైనదని, ముఖానికి రాసే పెయింట్ వంటిది కాదని, ఈ కాస్మెటిక్ రీసెర్చి పరిశోధకులు తెలుపుతున్నారు.