పురుషుల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా అప్రతిహత విజయాలతో దూసుకెళ్లి కప్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ మధుర క్షణాలను ఫ్యాన్స్ ఇంకా మరిచిపోకముందే ఇప్పుడు మహిళల టీ20 ప్రపంచకప్ కు రంగం సిద్ధమైంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ ప్రపంచకప్ టోర్నీ అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్, స్కాట్లండ్ పోటీ పడనున్నాయి.
మొత్తం 10 టీమ్‌లను రెండు గ్రూపులుగా విభజించి ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. గ్రూప్ దశలో టాప్ 2 లో నిలిచిన 2 జట్లు సెమీ ఫైనల్ కు అర్హత సాధిస్తాయి. సెమీ ఫైనల్ మ్యాచ్‌లను అక్టోబర్ 17, 18 తేదీల్లో నిర్వహిస్తారు. ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 20న జరగనుంది. ఈ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో వీక్షించవచ్చు. అదే డిజిటల్‌లో అయితే హాట్ స్టార్ యాప్‌లో వీక్షించాల్సి ఉంటుంది.
ఇక ఇండియా టీమ్ గ్రూప్ ఎలో ఉంది. అందులో భారత జట్టు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక జట్లతో తలపడుతుంది. అక్టోబర్ 4వ తేదీన భారత జట్టు న్యూజిలాండ్‌తో, 6వ తేదీన పాకిస్థాన్‌తో, 9వ తేదీన శ్రీలంకతో, 13వ తేదీన ఆస్ట్రేలియాతో తలపడుతుంది. మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు లేదా రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అవుతాయి. అయితే ఈ టోర్నీ వాస్తవానికి బంగ్లాదేశ్ లో జరగాల్సి ఉంది. కానీ అక్కడి పరిస్థితుల కారణంగా టోర్నమెంట్‌ను దుబాయ్‌కు మార్చారు. దీంతో దుబాయ్, షార్జా వేదికలుగా ఈ మ్యాచ్‌లు జరుగుతాయి.