Nalla Thumma Chettu Kayalu : మనం ప్రతిరోజూ అనేక రకాల మొక్కలను చూస్తూ ఉంటాం. కానీ వాటిలో ఔషధ గుణాలు ఉంటాయని అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలియనే తెలియదు. ఇలాంటి మొక్కలల్లో తుమ్మ చెట్టు ఒకటి. గ్రామాలలో ఈ మొక్క ఎక్కువగా కనబడుతుంది. తుమ్మ చెట్టును మనలో చాలా మంది చూసే ఉంటారు. పదునైన ముళ్లను, నల్లటి బెరడును, పసుపు పచ్చ పూలను ఈ చెట్టు కలిగి ఉంటుంది. తుమ్మ కాయలు పొడవుగా ఉంటాయి. తుమ్మ చెట్టులో కూడా నల్ల తుమ్మ, తెల్ల తుమ్మ, ఆస్ట్రేలియా తుమ్మ, నాగ తుమ్మ, సర్కాక్ తుమ్మ వంటి 160 రకాలు ఉంటాయి. 40 నుండి 70 అడుగుల వరకు కూడా తుమ్మ చెట్లు పెరుగుతాయి. ఈ చెట్టు నీరు ఎక్కువగా అవసరం ఉండదు. ఎండిన తుమ్మ చెట్టు కొమ్మలను రక్షణ కొరకు కంచెగా ఉపయోగిస్తారు. బొమ్మలు ఫర్నీచర్, పడవల తయారీలో కూడా ఈ తుమ్మ చెట్టును ఉపయోగిస్తారు.
అదేవిధంగా తుమ్మ చెట్టులో ప్రతి భాగం కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. నల్ల తుమ్మ చెట్టులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. నల్ల తుమ్మ చెట్టు కాయలను, జిగురును, బెరడును కలిపి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు పూటలా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు చక్కగా కలుగుతుంది. లేత నల్ల తుమ్మ ఆకుల నుండి సేకరించిన రసాన్ని తాగడం వల్ల స్త్రీలల్లో నెలసరి సమయంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి. ఎండిన నల్ల తుమ్మకాయలను సేకరించి పేస్ట్ లా చేయాలి. ఈ మిశ్రమానికి కండచక్కెర పొడిని కలిపి తీసుకోవడం వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. అలాగే వీర్యం యొక్క నాణ్యత కూడా పెరుగుతుంది. నల్ల తుమ్మ కాయలను తినడం వల్ల పురుషుల్లో వచ్చే స్వప్న స్కలనం, శీఘ్ర స్కలనం సమస్యలు కూడా తగ్గుతాయి. నల్ల తుమ్మ బెరడుతో చేసిన కషాయాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించి ఉమ్మి వేయాలి.
ఇలా చేయడం వల్ల నోటిలో అల్సర్లు, నోటి పూత వంటి సమస్యలు తగ్గుతాయి. నల్ల తుమ్మ చెట్టు బంకను కూడా నోట్లో పెట్టుకుని కాసేపు అలాగే ఉంచాలి. తరువాత లాలాజలాన్ని ఉమ్మి వేయాలి. ఇలా చేయడం వల్ల కూడా నోటి అల్సర్లు తగ్గుతాయి. నల్ల తుమ్మ బంకను పొడిగా చేసి ఆవు పాలల్లో కలిపి తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. విరిగిన ఎముకలు సైతం త్వరగా అతుకుంటాయి. నల్ల తుమ్మ చెట్టు బెరడు పొడిని 5 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. దీనికి 2 గ్రాముల కాయ చూర్ణం పొడిని కలిపి వెన్నపూసతో కలిపి తీసుకోవడం వల్ల తెల్లబట్ట సమస్య తగ్గుతుంది. నల్ల తుమ్మచెట్టు ఆకులను ముద్దగా నూరాలి. ఈ మిశ్రమాన్ని పది గ్రాముల మోతాదులో రోజుకు రెండు పూటలా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల రక్తమొలల సమస్య తగ్గుతుంది. అయితే ఈ చిట్కాను పాటించేటప్పుడు ఉప్పు, పులుపు, మసాలా వంటి వాటికి దూరంగా ఉండాలి.
నల్ల తుమ్మ చెట్టు బెరడును పొడిలా చేసి రోజుకు రెండు పూటలా నెయ్యితో కలిపి తీసుకోవడం వల్ల నీరసం, నిసత్తువ తగ్గి శరీరానికి తగినంత బలం చేకూరుతుంది. నీటిలో జీలకర్ర, వాము, నల్ల తుమ్మ ఆకులను వేసి కషాయంలా చేసుకోవాలి. ఈ కషాయాన్ని వడకట్టి తీసుకోవడం వల్ల డయేరియా సమస్య తగ్గుతుంది. తుమ్మ చెట్టు బెరడును నమలడం వల్ల దంతాల సమస్యలు తగ్గుతాయి. తుమ్మ చెట్టు బెరడుతో చేసిన కషాయంలో సైంధవ లవణాన్ని కలిపి పుక్కిలిస్తూ ఉంటే టాన్సిల్స్ సమస్య తగ్గుతుంది. ఈ విధంగా తుమ్మ చెట్టు మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని వాడడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.