Tamarind Tree : చింత చెట్టు.. ఇది మనందరికీ తెలుసు. చింత చెట్టు నుండి వచ్చే కాయలు పండిన తరువాత వాటిని మనం చింతపండుగా వంటల్లో పులుపు రుచి కోసం ఉపయోగిస్తాం. కేవలం వంటల్లోనే కాకుండా మనకు వచ్చే అనారోగ్య సమస్యలను నయం చేసే ఔషధంగా కూడా ఆయుర్వేదంలో దీన్ని ఉపయోగిస్తారు. చింతచెట్టు ఆకులు, పువ్వులు, కాయలు, బెరడు, గింజలు అన్నీ కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. చింత చెట్టు వల్ల మనకు కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాత రోగాలను నయం చేయడంలో చింతకాయలు ఎంతో ఉపయోగపడతాయి. కానీ కఫ, పిత్త రోగాలు ఉన్న వారికి చింతకాయలు హాని చేస్తాయి. కనుక పిత్త, కఫ రోగాలు ఉన్న వారు పచ్చి చింతకాయలను, వాటితో చేసే పచ్చడిని కూడా తినకూడదు. ఈ పిత్త, కఫ రోగాలను నయం చేయడంలో చింత పండు ఉపయోగపడుతుంది.
చింతచెట్టు పువ్వును కూడా మనం ఔషధంగా ఉపయోగించవచ్చు. వాత, కఫ, పిత్త రోగాలను, కాలేయ సంబంధిత సమస్యలను నయం చేయడంలో, కాలేయాన్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచడంలో ఈ చింత పువ్వు మనకు ఎంతో ఉపయోగపడుతుంది. అదే విధంగా మన శరీరంలో వచ్చే నొప్పులను, వాపులను నయం చేయడంలో మనకు చింత చెట్టు ఆకులు ఎంతో సహాయపడతాయి. చింత ఆకులను కచ్చా పచ్చాగా దంచి నూనెలో వేసి వేయించాలి. ఇలా వేయించిన వెంటనే వాటిని ఒక వస్త్రంలో వేసి మూట కట్టి నొప్పులు, వాపులు ఉన్న చోట కాపడం పెట్టుకోవాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల క్రమంగా నొప్పులు, వాపులు తగ్గుతాయి. చేతులు, కాళ్లు పడిపోయిన వారు, పక్షవాత రోగులకు చింత బెరడు ఎంతో ఉపయోగపడుతుంది. చింత చెట్టు బెరడును నీటిలో నానబెట్టి మెత్తగా నూరి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని రోజూ పడిపోయిన చేతులకు, కాళ్లకు అలాగే పక్షవాతం వల్ల దెబ్బ తిన్న శరీర భాగాలకు రోజూ రాస్తూ ఉండడం వల్ల క్రమంగా ఆయా ఆవయవాలలో కదలికలు మొదలవుతాయని నిపుణులు చెబుతున్నారు.
మూత్రాశయ సంబంధిత సమస్యలతో బాధపడే వారు చింత చెట్టు బెరడును ఎండబెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. రోజూ 2 గ్రాముల పొడిని ఒక టీ స్పూన్ తేనెతో కలిపి తీసుకోవడం వల్ల మూత్రాశయ సమస్యలు తగ్గుతాయి. చెవి రోగాలతో బాధ పడే వారు చింతాకులను నీటితో కలిపి దంచి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని వడకట్టి 2 చుక్కల మోతాదులో చెవిలో వేసుకోవడం వల్ల అన్ని రకాల చెవి రోగాలు తగ్గుతాయి. పండిన చింతకాయల గుజ్జును చర్మం పై ఉంచి కట్టు కట్టడం వల్ల వ్రణాలు త్వరగా మానుతాయి. ఈ విధంగా చేయడం వల్ల ఎముకలు కూడా త్వరగా అతుక్కుంటాయి.
జిగట విరేచనాలతో బాధ పడే వారు 2 గ్రాముల చింత గింజల పొడిని, 3 గ్రాముల జీలకర్ర పొడిని, కండ చక్కెరను కలిపి 4 గంటలకొకసారి తీసుకోవడం వల్ల జిగట విరేచనాలు తగ్గుతాయి. నపుంసకత్వంతో బాధ పడే వారు చింత గింజలను నీటిలో 24 గంటల పాటు నానబెట్టి పైన పొట్టును తీసేసి లోపలి పప్పును మెత్తగా నూరి దానికి సమానంగా పాత బెల్లాన్ని కలిపి రెండూ కలిసేలా బాగా దంచాలి. ఈ మిశ్రమాన్ని పది గ్రాముల మోతాదులో ఉండలుగా కట్టి ఎండిన తరువాత గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. రోజూ రెండు పూటలా రెండు ఉండలు మంచి నీటితో తీసుకుని ఒక గ్లాస్ పాలను తాగాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల నపుంసకత్వం తగ్గి వీర్య వృద్ధి కలుగుతుంది. పాత చింతపండు గుజ్జును ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని దానిలో ఒక టీ స్పూన్ పటిక బెల్లాన్ని కలిపి రెండు పూటలా తీసుకోవడం వల్ల గుండె వాపు తగ్గుతుంది. ఈ విధంగా చింత చెట్టు మనకు వచ్చే అనేక అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.