కొన్నిసార్లు కొన్ని ఫొటోలను చూసినప్పుడు సహజంగానే మనకు భ్రమ కలుగుతుంది. ఎవరు ఏ భంగిమలో ఉన్నారు ? ఎవరు ఏ దుస్తులను ధరించి ఉన్నారు ? అసలు ఎవరి తలలు ఏవి, ఎవరి శరీరాలు ఏవి ? అని గుర్తించడంలో భ్రమ పడుతుంటాం. ఇక కొందరు సహజంగా తీసుకునే ఫొటోలే అలా భ్రాంతి కలిగించే (ఆప్టికల్ ఇల్యూషన్) ఫొటోలుగా మారుతుంటాయి. అలా ఓ జంట తీసుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
లండన్‌కు చెందిన నౌక్, కాస్సిడీ అనే దంపతులు 5 నెలల కిందట ఓ సోఫాను కొన్నారు. దానిపై తాజాగా ఫొటోలు దిగారు. అయితే వాటిల్లో ఓ ఫొటో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోగా మారింది. అందులో ఇద్దరూ ఒకర్నొకరు కౌగిలించుకుని ఫొటోను తీసుకున్నారు. కానీ మొదటిసారి చూస్తే ఆ ఫొటో ఏదో తేడాగా ఉన్నట్లు అనిపిస్తుంది.
ఆ యువతి షర్టు, ప్యాంటు ధరించి ఉన్నట్లు, ఆమె పార్ట్‌నర్ షర్టు, మిడ్డీ ధరించి ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే అసలు వారు ఏయే దుస్తులు ధరించారో తెలుస్తుంది. ఈ ఫొటో చాలా మందిని ఇలాగే భ్రమకు గురి చేసింది. అందుకనే వైరల్‌గా మారింది. దీన్ని చాలా మంది షేర్ కూడా చేస్తున్నారు.