Nayanthara : గత కొంత కాలం నుంచి నయనతార పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందా ? అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి. ఈమె దర్శకుడు విగ్నేష్ శివన్‌ను ప్రేమిస్తున్న విషయం విదితమే. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఎంతలా అంటే ప్రేమికుల రోజు స్వయంగా నయనతార.. విగ్నేష్ శివన్‌కు అర్థరాత్రి శుభాకాంక్షలు తెలియజేసింది. దీంతో వీరు చాలా గాఢంగా ప్రేమించుకుంటున్నట్లు అర్థమైంది. అయితే వీరి గురించి ఓ సంచలన వార్త బయటకు వచ్చింది. వీరు రహస్య వివాహం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి.
నయనతార, విగ్నేష్ శివన్ ఎంతో కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. అప్పట్లో నయనతార, శింబుల మధ్య లవ్ ట్రాక్ నడిచింది. వీరు పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ బ్రేకప్ చెప్పుకున్నారు. తరువాత నయనతార.. ప్రభుదేవాలు ప్రేమించుకున్నారు. ఆమెను పెళ్లి చేసుకునేందుకు ప్రభుదేవా ఏకంగా తన భార్యకే విడాకులు ఇచ్చి సంచలనం సృష్టించారు. అయితే వారి పెళ్లి ఇంకొద్ది రోజుల్లో జరుగుతుంది అనగా.. రద్దు అయింది. తరువాత విగ్నేష్ శివన్‌తో నయన్ ప్రేమలో పడింది. ఈ క్రమంలోనే ఎన్నో ఏళ్లుగా వీరు ప్రేమలోనే ఉన్నారు.
ఇక వీరి జాతకంలో దోషాలు ఉన్నాయని చెప్పి పలు ఆలయాల్లో పూజలు కూడా చేశారు. దీంతో వీరు పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే తమ పెళ్లికి ఇంకా సమయం ఉందని.. 2 ఏళ్లు ఆగాక పెళ్లి చేసుకుంటామని చెప్పారు. కానీ తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోను బట్టి చూస్తే వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది. వీరు ఒక ఆలయానికి వెళ్లినప్పుడు అక్కడ నయనతార పాపిట్లో కుంకుమతో కనిపించింది. సాధారణంగా పెళ్లయిన వారు మాత్రమే ఇలా పాపిట్లో సింధూరాన్ని ధరిస్తారు. కనుక నయనతారకు, విగ్నేష్ శివన్‌కు పెళ్లయిందనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి.
ఈ క్రమంలోనే వీరి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరు రహస్యంగా వివాహం చేసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే ఇందులో నిజం ఎంత ఉంది ? అన్న విషయం తెలియాల్సి ఉంది.