Gongura Chicken Curry : చికెన్ ను మనం తరచూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కండ పుష్టికి, దేహ దారుఢ్యం కోసం వ్యాయామం చేసే వారికి చికెన్ ఎంతో సహాయపడుతుంది. చికెన్ తో మనం ఎక్కువగా కూర, బిర్యానీ, ఫ్రై వంటి వాటిని చేస్తూ ఉంటాం. చికెన్ లో గోంగూరను కలిపి గోంగూర చికెన్ కూడా తయారు చేయవచ్చు. మనందరికీ గోంగూర మటన్ గురించి తెలుసు. కానీ గోంగూర చికెన్ కూర గురించి చాలా మందికి తెలియదు. గోంగూర చికెన్ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. గోంగూర చికెన్ ను ఎలా తయారు చేసుకోవాలి.. దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోంగూర చికెన్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
బోన్ లెస్ చికెన్ – 300 గ్రా., గోంగూర – ఒక కట్ట (మధ్యస్థంగా ఉన్నది), కారం – ఒకటిన్నర టేబుల్ స్పూన్, ఉప్పు – రుచికి తగినంత, పసుపు – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన టమాట – 1, తరిగిన పచ్చి మిర్చి – 3, తరిగిన టమాట – ఒకటి, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా, నూనె – 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, కసూరి మెంతి – ఒక టేబుల్ స్పూన్, సాజీరా – ఒక టీ స్పూన్, బిర్యానీ ఆకు – ఒకటి, వెల్లుల్లి రెబ్బలు – 6, ఎండు కొబ్బరి ముక్కలు – ఒకటిన్నర టేబుల్ స్పూన్, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – తగినన్ని.
గోంగూర చికెన్ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో ధనియాలను, ఎండు కొబ్బరిని వేసి వేయించాలి. ఇవి చల్లగా అయిన తరువాత ఒక జార్ లోకి తీసుకుని వీటితోపాటు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి కాగిన తరువాత బిర్యానీ ఆకు, సాజీరా వేయాలి. ఇవి వేగిన తరువాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాల పాటు వేయించి, తరిగిన కొత్తిమీర, పుదీనా, కసూరి మెంతి వేసి కలిపి 5 నిమిషాల పాటు వేయించాలి. తరువాత శుభ్రంగా కడిగిన గోంగూరను వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. గోంగూర ఉడికిన తరువాత టమాట ముక్కలు, కారం, పసుపు వేసి కలపాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగిన చికెన్ ను వేసి బాగా కలిపి మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. తరువాత తగినన్ని నీళ్లను, రుచికి తగినంత ఉప్పును వేసి కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత ముందుగా పొడిలా చేసుకున్న ధనియాల మిశ్రమాన్ని వేసి కలిపి చికెన్ పూర్తిగా ఉడికే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా రుచిగా ఉండే గోంగూర చికెన్ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, రాగి సంగటి వంటి వాటితో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. చికెన్ తో ఎప్పుడూ చేసే వంటలకు బదులుగా అప్పుడప్పుడు ఇలా గోంగూర చికెన్ ను తయారు చేసుకుని తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది.